నెల్లూరు: వలసల జోరుతో మంచి ఊపుమీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

కావలి నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే లు విష్ణువర్ధన్ రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డి లు ఇక పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. కావలి టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వంటేరు వేణుగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. 

తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ వీడతానంటూ అల్టిమేటం కూడా జారీ చేశారు. ఇటీవలే తన బలాన్ని నిరూపించేందుకు కావలి నియోజకవర్గంలో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు వంటేరు. ఆ సమయంలో వంటేరుకు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి మద్దతు పలికారు. 

అయితే అధిష్టానంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఇద్దరు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమై పార్టీలో చేరే అంశంపై నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది.