నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుండి వైసీపీ టిక్కెట్టు కోసం విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తనకు టిక్కెట్టు ఇవ్వాలని కోరుతూ విష్ణువర్ధన్ రెడ్డి ర్యాలీ ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడ విష్ణువర్ధన్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుండి వైసీపీ టిక్కెట్టును కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆశిస్తున్నారు. వైఎస్ కుటుంబం వెంటే విష్ణువర్ధన్ రెడ్డి నడిచాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం.  వైఎస్ మరణించిన తర్వాత జగన్‌పై కేసులు పెట్టడాన్ని, ఆ తర్వాత జగన్ అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడ విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.

జగన్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలో చేరారు. వైసీపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. అయితే 2014 ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డికి కాకుండా ప్రతాప్‌కుమార్ రెడ్డికి జగన్ టిక్కెట్టు ఇచ్చారు. కావలి నుండి ప్రతాప్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడ ప్రతాప్ కుమార్ రెడ్డికే టిక్కెట్టు ఇవ్వనున్నట్టు జగన్ ప్రకటించారు.

జగన్ పాదయాత్ర ముగించిన తర్వాత ఇడుపులపాయలో జగన్‌తో విష్ణువర్ధన్ రెడ్డి సుధీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే కావలి సీటు విషయమై జగన్ విష్ణువర్ధన్ రెడ్డికి స్పష్టత ఇచ్చారు. అయితే ఈ విషయమై విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు.

విష్ణువర్ధన్ రెడ్డిని చల్లారపర్చేందుకు వైసీపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్ రెడ్డిలు ఇటీవల విష్ణుతో చర్చించారు. అయినా కూడ ఆయన తగ్గలేదు.

కావలి నుండి వైసీపీ టిక్కెట్టు తరపున పోటీ చేసేందుకు అవకాశం కల్పించనందుకు నిరసనగా శుక్రవారం నుండి విష్ణువర్ధన్ రెడ్డి ర్యాలీ ప్రారంభించారు. విష్ణువర్ధన్ రెడ్డి నిర్వహించిన ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మద్దతు ప్రకటించారు. కావలితో పాటు కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల నుండి కూడ విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.