రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై శాసనసభ చేసిన ఏకగ్రీవ తీర్మానం సందర్భంగా విష్ణు కుమార్ రాజు వ్యవహరించిన తీరు విమర్శలకు గురవుతోంది. ఆ తీర్మానానికి విష్ణు కుమార్ రాజు సహకరించడం బిజెపి నేతలకు మింగుడు పడడం లేదు.

విశాఖపట్నం: శాసనసభ్యుడు విష్ణు కుమార్ రాజు బిజెపికి షాక్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఆయన వ్యవహార శైలిని పరిశీలిస్తే ఆయన బిజెపి నుంచి వైదొలగాలనే ఉద్దేశంతో ఉన్నట్లు అర్థమవుతోంది. బిజెపితో చంద్రబాబు తెగదెంపులు చేసుకున్న తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నాయకుల నుంచే వస్తున్నాయి. 

ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఆ విషయాన్ని పట్టిస్తున్నాయని అంటున్నారు. "ఈ రోజు నేను బిజెపిలో ఉన్నాను. రేపు అక్కడ ఉండవచ్చు.. ఉండకపోవచ్చు" అని ఆయన అసెంబ్లీ సమావేశాల తర్వాత చేసిన వ్యాఖ్యలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపితో పొత్తు పెట్టుకున్న బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 

విష్ణు కుమార్ రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బిజెపి ఎమ్మెల్యేలు నలుగురిలో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయి. విష్ణు కుమార్ రాజును బిజెపి శాసనసభా పక్ష నేతగా నియమించారు. ఇటీవల జరిగిన శాసనసభా సమావేశాలకు మిగతా పార్టీ శాసనసభ్యుల మాదిరిగా కాకుండా ప్రతి రోజూ హాజరయ్యారు. 

దానికితోడు, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై శాసనసభ చేసిన ఏకగ్రీవ తీర్మానం సందర్భంగా విష్ణు కుమార్ రాజు వ్యవహరించిన తీరు విమర్శలకు గురవుతోంది. ఆ తీర్మానానికి విష్ణు కుమార్ రాజు సహకరించడం బిజెపి నేతలకు మింగుడు పడడం లేదు. కేంద్రం అన్యాయం చేసిందని చేసిన తీర్మానానికి విష్ణు కుమార్ రాజు ఎలా సహకరిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. 

బిజెపిపై వ్యతిరేకతతో ఉన్న విష్ణు కుమార్ రాజును వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించారు. కానీ, వైసిపిలో చేరేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. ఆయన టీడీపిలో చేరడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఇప్పటి వరకు టీడీపి ఇంచార్జీని ప్రకటించలేదు. విష్ణుకుమార్ రాజును పార్టీలోకి తీసుకునే ఉద్దేశంతోనే టీడీపీ అధినేత ఆ సీటుకు ఇంచార్జీని ఖరారు చేయలేదని అంటున్నారు. దీంతో విష్ణుకుమార్ రాజు టీడీపిలో చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు.