నెలకు రూ. 200 కోట్ల లాభాలు:ఢిల్లీలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ధర్నాలో విజయసాయి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఎసీ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు వైసీపీ ఎంపీలు మద్దతు ప్రకటించారు. ప్యాక్టరీ ప్రైవేటీకరించకుండా అడ్డుకొంటామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.
న్యూఢిల్లీ:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఎసీ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు వైసీపీ ఎంపీలు మద్దతు ప్రకటించారు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పార్లమెంట్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లేందుకు కార్మికులు ఈ ఆందోళనకు పూనుకొన్నారు.
ఈ ధర్నాకు వైసీపీ మద్దతు ప్రకటించింది.వైసీపీ ఎంపీలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఎన్నో పోరాటాలతోనే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 1991లో ఇక్కడ స్టీల్ ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. ఆ తర్వాత దేశంలోనే అతి పెద్ద ఫ్యాక్టరీగా అవతరించిందన్నారు. ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి సుమారు 70 వేల మంది పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని ఆయన గుర్తు చేశారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము ఒప్పుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పటికీ నెలకు రూ 200 కోట్ల లాభాలతో ఈ ఫ్యాక్టరీ నడుస్తుందన్నారు. ఇలాంటి ఫ్యాక్టరీని ప్రైవేటీకరించవద్దని ఆయన కోరారు.