Vizag Fishing Harbour:వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై కాంగ్రెస్ సీరియస్.. వారిని ఆదుకోవాలంటూ డిమాండ్
Visakhapatnam fishing harbour: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 42 బోట్లు దగ్ధమైన ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. జిల్లా కలెక్టర్ ఏ.మల్లికార్జున ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజనల్ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (హార్బర్), జాయింట్ డైరెక్టర్ (ఫిషరీస్), జిల్లా అటవీ అధికారి, రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఆర్ఎస్డీఎల్) అసిస్టెంట్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేశారు.
Congress on Vizag fishing harbour fire: వైజాగ్‌లోని ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో పడవలు ధ్వంసమై జీవనోపాధిని కోల్పోయిన 450 మంది మత్స్యకార బోటు కార్మికులకు ఆర్థిక సహాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) చీఫ్ గిడుగు రుద్రరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త బోట్లు రావడానికి ఆరు నెలల సమయం పడుతుందని రుద్రరాజు తెలిపారు. పడవ యజమానులకు జరిగిన నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం పరిహారం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడాన్ని ఆయన ఓ పత్రికా ప్రకటనలో స్వాగతించారు.
ఫైర్ సేఫ్టీ చర్యలు లేకపోవడంతో 42 పడవలు ధ్వంసమయ్యాయనీ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే వరకు మత్స్యకారులు మంటలను ఆర్పలేకపోయారని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హార్బర్‌లో నిఘా పెంచి ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో 2012లో అగ్ని ప్రమాదం కారణంగా 57 మంది మత్స్యకారుల ఇళ్లు ధ్వంసమయ్యాయనీ, బాధిత కుటుంబాలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఇళ్లు నిర్మించి ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో మత్స్యకారులకు డీజిల్‌పై సత్వరమే సబ్సిడీ విడుదల చేశారనీ, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సత్వరమే సబ్సిడీని విడుదల చేయడం లేదని ఆరోపించారు.
పవన్ ఆర్థిక సాయం..
విశాఖ హార్బర్ లో 42 పడవలు ధ్వంసమైన ఘటనలో గాయపడిన మత్స్యకారుల కుటుంబాలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథంతో సాయం ప్రకటించారు. విశాఖ షిప్పింగ్ హార్బర్ లో అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు జనసేన తరఫున యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించాను. "మరో రెండు మూడు రోజుల్లో నేనే వచ్చి ఇస్తాను. వారి కుటుంబాలకు జనసేన అండగా ఉంటుంది" అని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారుల సంక్షేమం, ఉపాధిపై నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మత్స్యకారుల జీతభత్యాలు, భద్రతా సామగ్రిలో అనవసరంగా కోతలు పెడుతున్నారని, సరైన బోట్లు, జెట్టీలు, గో సరఫరాపై ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు.