Asianet News TeluguAsianet News Telugu

విశాఖ ఉక్కు ఆందోళనలు బేఖాతర్: అమ్మకానికి అడుగులు ఇవీ....

విశాఖ ఉక్కు పరిశ్రమకు (ఆర్‌ఐఎన్‌ఎల్‌) నగరం నడిబొడ్డులో ఉన్న మద్దిలపాలెం, అత్యంత ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు పొందిన సీతమ్మధార ప్రాంతానికి చేరువలో ఉన్న 22.19 ఎకరాల భూమి అప్పగింతకు రంగం సిద్ధం చేశారు

Visakha steel plant assets for sale, though protest is going on
Author
Visakhapatnam, First Published Mar 5, 2021, 10:44 AM IST

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంటును ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ వైపు భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నా పరిశ్రమ ఉన్నతాధికారులు విక్రయ ప్రక్రియలో అడుగులు ముందుకేస్తున్నారు. పరిశ్రమకు (ఆర్‌ఐఎన్‌ఎల్‌) నగరం నడిబొడ్డులో ఉన్న మద్దిలపాలెం, అత్యంత ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు పొందిన సీతమ్మధార ప్రాంతానికి చేరువలో ఉన్న 22.19 ఎకరాల భూమి అప్పగింతకు రంగం సిద్ధం చేశారు. 

ఆ ప్రాంతంలో దశాబ్దాల కిందట కర్మాగార ఉద్యోగుల కోసం చేపట్టిన 830 క్వార్టర్లు శిథిలమయ్యాయి. 130 క్వార్టర్లకు మరమ్మతులు చేసుకుని కుటుంబాలు ఉంటున్నాయి. ఆ భూమిలో వ్యాపార, నివాస సముదాయాలను నిర్మించి విక్రయించాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన పనులు చేయడానికి జాతీయ భవన నిర్మాణ కార్పొరేషన్‌తో (ఎన్‌బీసీసీ) గత నెల 26న ఆర్‌ఐఎన్‌ఎల్‌ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. 

భూమిని నేరుగా విక్రయించడం కన్నా.. భవన నిర్మాణాలన్నీ పూర్తి చేసి విక్రయిస్తే మరింత లాభం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ భూమిని అత్యంత లాభదాయకంగా మార్చుకోవాలంటే భారీగా పెట్టుబడి పెట్టాలి. కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆర్‌ఐఎన్‌ఎల్‌ నిర్ణయం ఎవరికి అనుకూలిస్తుందన్నది చర్చనీయాంశమవుతోంది. ఉక్కు కర్మాగార అధికారులు ఎందుకు రహస్యంగా ఉంచారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌ఐఎన్‌ఎల్‌ తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఎన్‌బీసీసీ  బహిర్గతం చేసింది.

* ప్రాజెక్టు అంచనా వ్యయంలోగానీ, వాస్తవంగా అయ్యే వ్యయంలోగానీ 7%ను (ఏది తక్కువైతే అది) ఎన్‌బీసీసీకి ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ రుసుముల కింద విశాఖ ఉక్కు కర్మాగారం చెల్లిస్తుంది.

* దీంతోపాటు వాణిజ్య/నివాస ప్రాంగణాలను విక్రయించడానికి వీలుగా రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్లకు, ప్రచారానికి, మార్కెటింగ్‌ కార్యకలాపాలను నిర్వహించినందుకు విక్రయ మొత్తంలో ఒక శాతం మొత్తాన్ని ‘ప్రాజెక్ట్‌ మార్కెటింగ్‌ రుసుము’ కింద ఎన్‌బీసీసీకి చెల్లించాలి.

* ప్రాజెక్టు వ్యయం ఎంతన్నది సమగ్ర పథక నివేదిక (డీపీఆర్‌) ఆమోదించాక తెలుస్తుందని ఎన్‌బీసీసీ పేర్కొంది. గజం రూ.లక్షన్నర పలుకుతున్న ప్రాంతంలో ఉన్న ఆ భూమి విలువ దాదాపు రూ.1,540 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.

Follow Us:
Download App:
  • android
  • ios