విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా జుత్తాడ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన సంఘటనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేవలం పావుగంటలోనే అప్పలరాజు ఆరుగురిని సైకోలా మారిపోయి హత్య చేసినట్లు గుర్తించారు. తన కూతురితో విజయ్ పెట్టుకున్న అక్రమ సంబంధం కారణంగానే అప్పలరాజు కుటుంబాన్ని మట్టుపెట్టినట్లు భావిస్తున్నారు. 

అప్పలరాజు ఉదయం 5 గంటల నుంచి ఇంటి వద్ద ఆయుధంతో మాటు వేశాడు. ఉదయం 5.30 గంటలకు రమాదేవి తలుపు తీసిన వెంటనే ఒక్కొక్కరిని నరుకుతూ వెళ్లాడు గేటు వద్ద మొదలు పెట్టిన హత్యాకాండను వంటగది వరకు కొనసాగించాడు. పావు గంటలో పిల్లాపెద్దా అని చూడకుండా ఆరుగురిని చంపేశాడు. 

ఉదయం 5.45 గంటలకు అప్పలరాజు ఇంటి బయటకు వచ్చాడు. అరగంట పాటు రమాదేవి శవం పక్కనే కూర్చున్నాడు. ఉదయం 6.15 గంటలక 100 నెంబర్ కు ఫోన్ చేశాడు. 100 నుంచి 108కు ఫోన్ వెళ్లింది. 108 వాహనం సిబ్బంది వచ్చేసరికి నిందితుడు కత్తి పట్టుకుని పచార్లు చేస్తూ ఎవరో వస్తారో రండి అంటూ బెదిరిస్తూ వచ్చాడు. 

అప్పలరాజు చేతిలో బమ్మిడి రమణ (63), బమ్మిడి ఉషారాణి (35), అల్లు రమాదేవి (53), నకెళ్ల అరుణ (40), బమ్మిడి ఉదయనందన్ (2), బమ్మిడి ఉర్విష (6) హతమయ్యారు. మృతదేహాలు రక్తంమడుగులో పడి ఉన్నాయి. వారిని హత్య చేసిన తర్వాత అప్పలరాజు పోలీసులకు లొంగిపోయాడు బాధితుల ఆరోపణతో పోలీసులు మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు 

కాంట్రాక్టర్ విజయ్ కిరణ్ కు ఆదిలక్ష్మి అంటే ఇష్టం. అమ్మ చనిపోయిన తర్వాత కుంగిపోయిన విజయ్ తన బిడ్డగా అమ్మ పుడుతుందని భావించారు. తొలుత వరుసగా ఇద్దరు కుమారులు పుట్టారు.  భార్యకు కుటుంబ నియంత్రణ చేయించాలని చెప్పినా విజయ్ వినలేదు. తన అమ్మ పుడుతుందని అతను భావించాడు. పూజలు చేశాడు. మొక్కులు మొక్కుకున్నాడు. చివరకు ఆరు నెలల క్రితం కూతురు పుట్టింది. ఆ సంతోషం ఏమీ మిగలకుండానే విజయ్ తన కుటుంబాన్ని కోల్పోయాడు.