Asianet News TeluguAsianet News Telugu

ఎట్టకేలకు సీజ్: ఎల్జీ పాలిమర్స్ కథ కంచికి చేరింది

ఎట్టకేలకు ఎల్జీ పాలీమర్స్ ను సీజ్ చేశారు. దీంతో ఎల్జీ పాలిమర్స్ కథ కంచికి చేరింది. హైకోర్టు ఆదేశాలతో ఎల్జీ పాలిమర్స్ ను విశాఖపట్నం అధికార యంత్రాంగం కదిలింది.

Visakha LG Polymers siezed following High Court orders
Author
Visakhapatnam, First Published May 26, 2020, 5:46 PM IST

హైకోర్టు ఆదేశాలతో విశాఖ జిల్లా యంత్రాంగం కదిలింది. విషవాయువులు చిమ్మిన పరిశ్రమను సీజ్ చేసింది. మరోవైపు ఈ ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయంటున్న ప్రతిపక్షం...జ్యుడీషియల్ విచారణ కోసం పట్టుబడుతోంది. విషవాయువులు చిమ్మి 12మంది ప్రాణాలు బలితీసుకున్న ఎల్జీ పాలిమర్ కంపెనీని శాశ్వతంగా తరలించాలన్న బాధితుల డిమాండ్ నెరవేరే దిశగా తొలి అడుగుపడింది. స్టైరిన్ గ్యాస్ లీక్ ఘటనను సుమోటో గా తీసుకుని విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ కర్మాగారం మూసివేయాలని నిర్ధేశించింది.

విచారణ కోసం నియమించిన బృందాలు తప్ప ఇతరులు ఎవరు ఫ్యాక్టరీ లోపలికి  ప్రవేశించడానికి వీల్లేదని స్పష్టం చేసింది న్యాయస్థానం. అలాగే, స్థిర,చర ఆస్తులను తమ ఆదేశం లేకుండా తరలించవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలు అందడంతో జిల్లా యంత్రాంగం హుటాహుటిన కదిలింది. ఎల్జీ పాలిమర్ సంస్థ ను సీజ్ చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన బృందాలు మొత్తానికి కంపెనీని సీజ్ చేశాయి.

Visakha LG Polymers siezed following High Court orders

నిజానికి ఎల్జీ పాలిమర్ కంపెనీ ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 14వేల టన్నుల స్టైరిన్  నిల్వలను తరలించుకుపోవాలని ఎల్జీ కంపెనీని ఆదేశించింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి వల్లే దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఈ ముడి సరుకును తిప్పి పంపించగలిగామని మంత్రులు కూడా ప్రకటించారు. అయితే.. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉందనేది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అనుమానం. ఎల్జీ పాలిమర్ యాజమాన్యానికి నష్టం కలుగకుండా ప్రభుత్వం స్టైరిన్ తరలించి మేలు చేసిందని ఇప్పుడు జనం కోసం కోసం నిర్ణయం తీసుకున్నామని చెబుతూ పక్కదారి పట్టిస్తోందని ఆరోపిస్తోంది.

ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ ఎల్జీ యాజమాన్యం నేరం నిరూపణ అయితే 30కోట్లు కాదని 300కోట్లు పరిహారం చెల్లించాల్సి వస్తుందని అంటోంది. ఎల్జీ పాలిమర్ కంపెనీపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీల నివేదికలు త్వరలో రానున్నాయి. వీటి అన్నింటినీ ఆధారంగా చేసుకుని కంపెనిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios