తిరుమల: వీఐపీ బ్రేక్ దర్శనాల అంశం టీటీడీని ముప్పు తిప్పలు పెడుతోంది. ఒకవైపు కోర్టులు, మరోవైపు ప్రజలు ముప్పేట దాడికి దిగుతున్నారు. దేవుడి దగ్గర వీఐపీ ఏంటంటూ నిలదీస్తున్నారు. దేవుడి దగ్గర భక్తులంతా సమానమేనని అలాంటప్పుడు ఎల్1, ఎల్ 2, బ్రేక్ దర్శనాలు ఎందుకంటూ నిప్పులు చెరుగుతున్నారు. 

తాజాగా సోమవారం హైకోర్టు టీటీడీ స్టాండింగ్ కమిటీపై ప్రశ్నల వర్షం కురిపించింది. టీటీడీలో ఎల్1, ఎల్ 2 బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తామంటూ ఓరల్ గా చెప్తే సరిపోతుందా అంటూ ప్రశ్నలు కురిపించింది. టీడీపీ పూర్తిస్థాయి బోర్డు ఏర్పడకముందు ఈ నిర్ణయం ఎలా చెల్లుతుందంటూ ప్రశ్నించారు. 

జీవో ఉందా లేక లిఖిత పూర్వకంగా ఏమైనా ఆధారం ఉందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. బ్రేక్ దర్శనాలపై పూర్తి అఫిడవిట్ దాఖలు చేయాలంటూ హైకోర్టు టీటీడీ స్టాండింగ్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేసింది. 

హైకోర్టు అఫిడవిట్ సమర్పించాల్సిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాలకమండలి తరపున ఎల్ 1, ఎల్ 2 వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. టీటీడీ పాలకమండలి పూర్తిగా ఏర్పడేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో తన ప్రకటనను ఆధారంగా చేసుకోవాలని కోరనున్నట్లు తెలుస్తోంది. 

అంతేకాదు 2012కు ముందు ఎలాంటి నియమ నిబంధనలు ఉండేవో వాటిని అమలులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. భక్తులకు రెండు మూడు గంటల్లోనే దర్శనాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతోందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.