కర్నూలు జిల్లా నంద్యాలలో భారత్ బంద్ ఉద్రిక్తతకు దారి తీసింది. పట్టణంలోని గాంధీ చౌక్‌లో బంద్‌కు మద్ధతుగా ర్యాలీ చేపట్టిన ఓ వర్గం ఎన్ఆర్‌సీ, సీఏఏకి అనుకూలంగా నినాదాలు చేయగా.. మరో వర్గం వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఇరు వర్గాల పోటా పోటీ నినాదాలతో ఆ ప్రాంతంల హోరెత్తింది.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. నంద్యాలకు సున్నిత ప్రాంతంగా పేరుంది. ఇక్కడ ముస్లిం జనాభా అధికం.. సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా వారు మంగళవారం నిరసన నిర్వహించిన సంగతి తెలిసిందే. 

Also Read:యువకున్ని ప్రేమించిన హిజ్రా.. ఆ ప్రేమను అతను వద్దన్నందుకు

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ కార్మిక సంఘాలు బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ బంద్ ప్రశాంతంగానే కొనసాగినప్పటికీ.. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఒకట్రెండు చోట్ల చెదురుముదురు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

బుద్వాన్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ నేతలకు, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం, ఘర్షణకు దారి తీసింది. కూచ్ బీహార్‌లో ఆందోళనకారులు ఓ బస్సును ధ్వంసం చేయగా.. ఉత్తర 24 పరగణా జిల్లాల్లో రైలు పట్టాల సమీపంలో పోలీసులు నాలుగు క్రూడ్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు.

ఒడిషా, పంజాబ్, కేరళ, ఢిల్లీలలో బంద్ ప్రభావం కనిపించింది. కొన్ని చోట్ల నిరసనకారులు రైలు పట్టాలపై బైఠాయించి రైళ్లను అడ్డుకున్నారు. అటు మహారాష్ట్రలో భారత్ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.

Also Read:భర్త బ్రహ్మచర్యం... భార్య శృంగారం కోసం పట్టుపట్టడంతో...

తెలుగు రాష్ట్రాల్లో బంద్ ప్రశాంతంగా జరిగింది. కాగా భారత్ బంద్ సందర్భంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, లెఫ్ట్ పార్టీలపై విరుచుకుపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయని.. ఇలాంటి చర్యలకు పాల్పడటం కన్నా, రాజకీయంగా సమాధి కావడం ఉత్తమమన్నారు.

రాష్ట్రంలో ఎటువంటి సమ్మెలను అనుమతించే ప్రసక్తే లేదని, సీపీఎంకు ఎటువంటి భావజాలం లేదంటూ దీదీ మండిపడ్డారు. రైల్వే ట్రాకులపై బాంబులు వేయడం, ప్రయాణికులపై దాడికి పాల్పడటం గుండాగిరికి నిదర్శనమని మమతా విమర్శించారు.