ప్రజాసేవ కోసం నియమించిన గ్రామ వాలంటీర్ అదే ప్రజలపాలిట శాపంగా మారాడు. బాపట్ల జిల్లాలో ఓ వాలంటీర్ 15ఏళ్ళ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దారుణం వెలుగుచూసింది. 

బాపట్ల: మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో యువతిని బంధించి అత్యాచారానికి పాల్పడిన ఘటన మొదలు ప్రతిరోజూ ఏదోచోట అత్యాచారాలు, అత్యాచరయత్నాలు, వేధింపు ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా బాపట్ల జిల్లాలో ఓ మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడిన దారుణం వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే... బాపట్ల జిల్లా (bapatla district)లోని కొరిశపాడు మండలంలో రావిపాటి కోటయ్య వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. అతడికి పెళ్ళయి భార్యతో కలిసే వుంటున్నాడు. ఇలా మంచి ఉద్యోగం, భార్యతో ఆనందంగా సాగుతున్న జీవితాన్ని అతడు చేజేతులా నాశనం చేసుకోవడమే కాదు మరో చిన్నారి జీవితంతో ఆడుకున్నాడు. 

ఇంట్లో భార్య వున్నప్పటికీ నీచపు ఆలోచనలతో రగిలిపోయిన కోటయ్య అదే గ్రామానికి చెందిన 15ఏళ్ల మైనర్ బాలికపై కన్నేసాడు. తండ్రిదండ్రులు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్లడంతో బాలిక అమ్మమ్మ వద్దే వుంటోంది. దీంతో బాలికను ఏంచేసినా గట్టిగా అడిగేవారెవరూ లేరని భావించాడో ఏమో వాలంటీర్ కోటయ్య దారుణానికి ఒడిగట్టాడు.

మాయమాటలు చెప్పి బాలికతో పరిచయం పెంచుకున్న అతడు గత మూడునెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొందంటూ బెదిరించడంతో బాలిక అలాగే చేసింది. ఇలా వాలంటీర్ చేతిలో ఆటబొమ్మగా మారింది చిన్నారి.

అయితే ఇటీవల కోటయ్య వికృతచేష్టలు మరీ ఎక్కువ కావడంతో బాలిక భరించలేకపోయింది. దీంతో తనవద్దకు తల్లిదండ్రులు వచ్చిన సమయంలో ఈ విషయాన్ని తెలిపింది. దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెంటనే పోలీసులు పోక్సో చట్ట కింద బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వాలంటీర్ పై కేసు నమోదు చేసారు.

తాను చేసిన నీచపు పని బయటపడిందని తెలియడంతో ప్రస్తుతం వాలంటీర్ కోటయ్య పరారీలో వున్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. బాలికను కూడా వైద్యపరీక్షల కోసం ఒంగోలు రిమ్స్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఇదిలావుంటే పల్నాడు జిల్లాలోనూ ఇలాగే మనవరాలి వయసున్న ఏడేళ్ల చిన్నారితో అత్యంత నీచంగా ప్రవర్తించాడో వృద్దుడు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామం రాజీవ్ గాంధీ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసముంటున్న ఏడేళ్ళ చిన్నారి ఇంటిపక్కనే వుండే ఓ వృద్దుడు కన్నేసాడు. ఈ క్రమంలోనే బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించాడు వృద్దుడు. అభం శుభం తెలియని బాలిక అతడు చెప్పినట్లు వినేది. ఈ క్రమంలోనే ఇంటిబయట ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారిని చూసిన వృద్దుడు ఇదే అదునుగా భావించాడు. చిన్నారివద్దకు వెళ్లి తన ఇంట్లో టీవి చూపిస్తానని తీసుకెళ్లి ఉదయం నుండి మద్యాహ్నం వరకు అక్కడే వుంచుకున్నాడు.

ఇంటా బయట బాలిక కనిపించకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఈ క్రమంలో బాలిక వృద్దుడి ఇంటినుండి బయటకు వచ్చింది. దీంతో ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లావని తల్లిదండ్రులు ప్రశ్నించగా వృద్దుడు ఇంట్లోకి తీసుకెళ్లి ఏం చేసాడో తెలిపింది. చిన్నారి మాటలనుబట్టి ఆమెపై వృద్దుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు భావించి పోలీసులకు పిర్యాదు చేసారు.