వివాహితను వేధించడమే కాదు అర్థరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడి గన్ తో బెదిరించిన మాజీ సైనికోోద్యోగి, ప్రస్తుత సచివాలయ ఉద్యోగిని గ్రామస్తులు కట్టేసి కొట్టారు.
ఒంగోలు : అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి వివాహితతో పాటు ఆమె భర్త, కుటుంబసభ్యులను తుపాకీతో బెదిరించిన సచివాలయ ఉద్యోగికి గ్రామస్తులు దేహశుద్ది చేసారు.వివాహితకు అసభ్యకర మెసేజ్ లు పంపిస్తూ వేధిస్తున్న సదరు ఉద్యోగిని హెచ్చరించడమే ఆ కుటుంబం తప్పయ్యింది. తననే నిలదీస్తారా అంటూ రెచ్చిపోయిన అతడు మహిళ ఇంటివద్ద గన్ తో హల్ చల్ చేసాడు. దీంతో వివాహిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు అతన్ని స్తంభానికి కట్టేసి కొట్టారు.
బాధిత కుటుంబం, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి భారత ఆర్మీలో సైనికుడిగా పనిచేసాడు. ఆర్మీ నుండి బయటకు వచ్చిన తర్వాత అతడు స్వగ్రామంలో వుంటున్నారు. ఈ క్రమంలోనే రాజుపాలెం సచివాలయంలో పశుసంవర్ధక సహాయకుడిగా ఉద్యోగంలో చేరాడు.
తన విధుల్లో భాగంగా రోజూ గ్రామంలో తిరిగేక్రమంలో ఓ వివాహితతో అతడికి పరిచయం ఏర్పడింది. మనస్పర్దలతో భర్తకు దూరంగా వుంటున్న ఆమెతో మోహన్ రెడ్డి సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఇలా వివాహితపై కన్నేసి మాయమాటలతో దగ్గరైన అతడు అదునుకోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సమయంలోనే మనస్పర్దలు తొలగి భార్యాభర్తలు ఒక్కటయ్యారు.
Read More గిద్దలూరులో దారుణం... కాపీ కొట్టనివ్వలేదని బ్లేడ్ తో ప్రిన్సిపల్ గొంతుకోసిన స్టూడెంట్
వివాహిత భర్తదగ్గరకు వెళ్లడంతో మోహన్ రెడ్డితో మాట్లాడటం మానేసింది. దీంతో ఆమెపై కోపంతో రగిలిపోయిన అతడు అసభ్యకర మెసేజ్ లు పంపించేవాడు. అతడి వేధింపులు భరించలేకపోయిన ఆమె భర్తతో పాటు కుటుంబసభ్యులకు ఈ విషయం చెప్పింది. దీంతో మరోసారి ఆమె జోలికి వస్తే బావుండదంటూ కుటుంబసభ్యులు మోహన్ రెడ్డిని హెచ్చరించారు.
వివాహితతో పాటు ఆమె కుటుంబంపై ఆగ్రహంతో ఊగిపోయిన మోహన్ రెడ్డి అర్ధరాత్రి తుపాకీ వాళ్ల ఇంటికి వెళ్లాడు. అందరినీ కాల్చిపడేస్తాను అంటూ కుటుంబాన్ని బెదిరించాడు. సర్దిచెప్పడానికి గ్రామస్తులు ప్రయత్నించినా వినకుండా మరింత రెచ్చిపోయాడు. దీంతో బాధిత కుటుంబం, గ్రామస్తులంతా కలిసి మోహన్ రెడ్డిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
గ్రామానికి చేరుకున్న పోలీసులు బాధిత మహిళ ఫిర్యాదుమేరకు మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడివద్ద గల తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
