విజయవాడలో కరోనా కలకలం కొనసాగుతోంది. తాజాగా నగరంలోని సత్యనారాయణపురం కు చెందిన ఓ బ్యాంక్ ఉద్యోగి ఈ మహమ్మారి బారిన పడ్డాడు. స్థానిక ఎస్బిఐ బ్యాంక్ లో క్యాషియర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. అలాగే బ్యాంక్ లోని మరో ఇద్దరు ఉద్యోగులకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 

ఆర్థిక లావాదేవీలతో పాటు వివిధ రకాల పనులపై సదరు ఎస్బీఐ బ్యాంక్ కు నిత్యం వందలాది మంది ఖాతాదారులు వస్తుంటారు. అయితే క్యాషియర్ కు కరోనా రావడంతో ఆ ప్రాంతంలో  అలజడి మొదలయ్యింది. ముఖ్యంగా ఆ బ్యాంక్ కు వెళ్లిన ఖాతాదారుల్లో ఈ భయాందోళన ఎక్కువగా వుంది.  

ఉద్యోగులను కరోనా పాజిటివ్ గా తేలిన వెంటనే ఎస్బీఐ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే బ్యాంక్ ను మూసివేశారు. ఈ బ్యాంక్ లో పనిచేసే ఇతర సిబ్బందికి కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు అధికారులు. అంతేకాకుండా పాజిటివ్ గా తేలిన ఉద్యోగులు కుటుంబసభ్యులకు, ప్రైమరీ కాంటాక్ట్స్ కు కూడా టెస్టులు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

  ఏపీ సచివాలయంలో శానిటైజర్ల కొరత.. పత్తాలేని థర్మల్ స్క్రీనింగ్...

ఇటీవల ఇదే సత్యనారాయణ పురం రామ కుటీర్ అపార్ట్ మెంట్ లో నివాసముండే ఓ సచివాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా అధికారులు గుర్తించారు. దీంతో  తీవ్ర ఆందోళనకు లోనయిన స్థానికులుకు తాజాగా బ్యాంక్ ఉద్యోగులకు కరోనా సోకినట్లు బయటపడటం మరింత భయాందోళనకు గురిచేస్తోంది. 

మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కావడం లేదు. ప్రతి రోజూ వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారి వల్ల కూడా కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే  182 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఇద్దరు మరణించారు. దాంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5429కి చేరుకోగా, మరణాలు 80కి చేరుకున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారిలో 135 మందికి కొత్తగా కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో గురువారం ఒక్కరోజే 38 మందికి కరోనా సోకినట్లు తేలింది. విదేశాల నుంచి వచ్చినవారిలో 9 మందికి కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయింది.