తుని రైలు దగ్ధం :ముద్రగడ, దాడిశెట్టి సహా 41 మందిపై కేసు కొట్టివేత
తుని రైలు దగ్దం కేసును సోమవారంనాడు విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది.
విజయవాడ: తుని రైలు దగ్దం కేసును సోమవారంనాడు విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. సున్నితమైన అంశాన్ని ఐదేళ్ల పాటు సాగదీశారని కోర్టు ప్రశ్నించింది. ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు విచారణ సరిగా చేయలేదని కోర్టు అభిప్రాయపడింది.
ఆధారాలు లేని కారణంగా 41 మందిపై పెట్టిన కేసును అక్రమ కేసుగా పరిగణిస్తున్నామని కోర్టు తెలిపింది. ఈ కేసును సరిగా విచారణ చేయని ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఐదేళ్లలో ఒక్క సాక్షిని మాత్రమే ప్రవేశ పెట్టారని న్యాయస్థానం గుర్తు చేసింది. అయితే కోర్టుకు హాజరైన సాక్షి కూడా తాను ఆ రైలులో ప్రయాణించలేదని కోర్టులో సాక్ష్యం చెప్పారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపుల రిజర్వేషన్ల అంశానికి సంబంధించి 2016లో పెద్ద ఎత్తున ఆందోళన సాగింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో కాపు రిజర్వేషన్ల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన సాగింది.ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. తుని వద్ద రైలుకు నిప్పు పెట్టారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తుని రైలు దగ్దం కేసులను ఎత్తివేసింది. 2016 జనవరి నుండి 2019 మార్చి వరకు కాపు రిజర్వేషన్ల ఆందోళనకు సంబంధించి 329 కేసులు నమోదయ్యాయి. వీటిలో 2020 నాటికే 153 కేసులు పరిష్కారమయ్యాయి. కొన్ని కేసులను ఉపసంహరించుకున్నారు. 2022 ఫిబ్రవరి మాసంలో కాపు ఉద్యమం సందర్భంగా నమోదైన 161 కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.