విజయవాడ: పోలీస్  కమిషనరేట్ ఉద్యోగి మహేష్ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని డీసీపీ విక్రాంత్ పాటిల్ చెప్పారు.స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు వచ్చిన మహేష్ ను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుండి తుపాకీతో కాల్చి చంపారు. 

మహేష్ పై అతి దగ్గర నుండి కాల్పులు జరిపినట్టుగా గుర్తించామన్నారు. మహేష్ తో పాటు మరొకరు కూడ ఈ ఘటనలో గాయపడినట్టుగా డీసీపీ చెప్పారు.  ఈ విషయమై గాయపడినవారిని కూడ విచారిస్తే ఇంకా కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 

నిందితులను పట్టుకొనేందుకు 10 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్పారు. మహేష్ ఉపయోగించిన కారును ఓనర్ ను కూడ పోలీసులు విచారించారు. మహేష్ ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

సంఘటన స్థలంలో సీసీటీవీ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మహేష్ కు ఎవరితో విబేధాలు లేవని కుటుంబసభ్యులు చెబుతున్నారు. తన బిడ్డను కాల్చి చంపాల్సినంత కోపం ఎవరికి ఉందో కనిపెట్టాలని తల్లి పోలీసులను కోరుతున్నారు.