దారుణం: తల్లిని గదిలో బంధించిన కొడుకు, ఎందుకంటే?

Vijayawada: Police saves woman locked up by her son
Highlights

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో తన తల్లిని  ఓ రూమ్‌లో బంధించాడు ఓ కొడుకు. ఈ విషయం తెలిసిన పోలీసులు బాధితురాలిని ఆ గది నుండి బంధ విముక్తి చేశారు.  ఈ ఘటన జగ్గయ్యపేటలో సంచలనం సృష్టించింది.

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో తన తల్లిని  ఓ రూమ్‌లో బంధించాడు ఓ కొడుకు. ఈ విషయం తెలిసిన పోలీసులు బాధితురాలిని ఆ గది నుండి బంధ విముక్తి చేశారు.  ఈ ఘటన జగ్గయ్యపేటలో సంచలనం సృష్టించింది.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన కె. మల్లిఖార్జున రావు, అతని భార్య ఆండాలు కలిసి .. 68 ఏళ్ల పద్మావతిని ఓ రూమ్‌లో బంధించారు. 

అంతేకాదు ఇంటిని వదిలి వెళ్లకపోతే  ప్రాణాలకు కూడ హాని చేస్తామని హెచ్చరించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు మల్లిఖార్జునరావు ఇంటిని సోదా చేసి బాధితురాలిని రక్షించారు.

మల్లిఖార్జునరావు రైస్ మిల్లు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో తాను ఉంటున్న ఇల్లును విక్రయించాలని భావించారు. కానీ, ఈ ఇల్లు మాత్రం మల్లిఖార్జునరావు తల్లైన పద్మావతి పేరున ఉంది. కానీ, ఆ ఇంటిని విక్రయించేందుకు పద్మావతి మాత్రం అంగీకరించలేదు. 

అయితే  ఆగ్రహంతో ఊగిపోయిన మల్లిఖార్జునరావు  తల్లి పద్మావతిని రూమ్‌లో బంధించాడు. అంతేకాదు ఇంటిని విక్రయించేందుకు ఒప్పుకోకపోతే రూమ్‌లోనే ఉంచుతామని మల్లిఖార్జున రావు దంపతులు పద్మావతిని బెదిరించారు.

ఈ విషయం తెలిసిన పోలీసులు పద్మావతిని బంధ విముక్తి చేశారు. ఇరుగుపొరుగు వారు ఈ విషయం తెలిసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందుకొన్న వెంటనే పోలీసులు మల్లిఖార్జునరావు ఇంట్లో బందీగా ఉన్న పద్మావతిని విడిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మల్లికార్జునరావు దంపతులను అరెస్ట్ చేశారు.


 

loader