విజయవాడ: గన్ మిస్ ఫైర్ అయి కాదు... ఉద్దేశపూర్వకంగానే కాల్చడం వల్ల హోంగార్డు వినోద్ భార్య సూర్యరత్నప్రభ చనిపోయినట్లు  విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిని శ్రీనివాసులు వెల్లడించారు. భార్యాభర్తల మధ్య గొడవ నేపధ్యంలోనే ఈ హత్య జరిగినట్లు వెల్లడించారు. హోమ్ గార్డు వినోద్ అతి దగ్గర నుంచి కాల్పులు జరపడంతో భార్య సూర్య రత్న ప్రభ చనిపోయిందని సిపి పేర్కొన్నారు. 

బంగారు ఆభరణాల విషయంలో గతకొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని తమ విచారణలో బయటపడిందని సిపి తెలిపారు. రూ.2.50 లక్షల విలువైన బంగారాన్ని వినోద్ మణపురం గోల్డ్ లోన్ సంస్థలో తాకట్టు పెట్టాడు. అయితే తన సోదరుడి పెళ్లి ఉండటంతో బంగారాన్ని విడిపించాలని రత్నప్రభ భర్తను అడిగేది. ఈ విషయంలో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని... రాత్రి కూడా ఇదే విషయమై మరోసారి గొడవపడినట్లు తెలుస్తోందన్నారు.

read more   గన్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్: భార్యను కాల్చి చంపి డ్రామా ఆడిన హోంగార్డు

భార్యతో గొడవ కారణంగా కోపోద్రిక్తుడైన వినోద్ తనవద్ద వున్న ఏఎస్పీ శశి భూషణ్ కు చెందిన  9 ఎంఎం పిస్టల్ తో భార్యను కాల్చినట్లు సిపి వెల్లడించారు. అతి దగ్గర్నుంచి కాల్చడంలో బుల్లెట్ చేతి నుంచి ఛాతీ లోపలగా దూసుకెళ్లి తీవ్రంగా రక్తస్రావమై రత్నప్రభ అక్కడికక్కడే చనిపోయిందన్నారు. వినోద్ ఒక బులెట్ మాత్రమే కాల్పుల్లో వాడినట్లు సిపి వెల్లడించారు. 

ఇప్పటికే హోంగార్డ్ వినోద్ ను అదుపులోకి తీసుకున్నట్లు సిపి తెలిపారు. తన వెపన్ ను హోం గార్డు దగ్గర వదిలి వెళ్లినందుకు ఏఎస్పీ శశి భూషణ్ పై కూడా చర్యలు ఉంటాయని విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిని శ్రీనివాసులు తెలిపారు.