రమేశ్ హాస్పిటల్ అగ్నిప్రమాదం కేసులో అనుమానితులు, ముద్దాయిలు విచారణకు సహకరించడం లేదన్నారు విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసరావు. నిందితుల కోసం హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరులకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపినట్లు చెప్పారు.

నిందితుల ఆచూకీ చెప్పిన వారికి లక్ష రూపాయల రివార్డ్ ఇస్తామని కమీషనర్ ప్రకటించారు. ఇక ఆసుపత్రి, హోటల్‌ మధ్య ఎంఓయూ ఉందన్న చెప్పిన రమేశ్ హాస్పిటల్ యాజమాన్యం ఇంత వరకు ఆ కాపీని తమకు ఇవ్వలేదని బత్తిన వెల్లడించారు.

మరోవైపు హీరో రామ్ ట్వీట్‌పై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు ఎలా చేయాలో తమకు తెలుసునని, పోలీసులకు రాజకీయాలు, మతాలతో సంబంధం ఉండదని శ్రీనివాసరావు తేల్చి చెప్పారు. 

కాగా కొద్దిరోజుల క్రితం స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్ అగ్ని ప్రమాదం ఘటనపై తెలుగు సినీ హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన ఆ ప్రమాద ఘటనపై వ్యాఖ్యానించారు.

స్వర్ణ ప్యాలెస్ ను రమేష్ ఆస్పత్రి యాజమాన్యం కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చక ముందు ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. అప్పుడే అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించేవాళ్లని ఆయన ప్రశ్నించారు.

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఫైర్+ ఫీజు = ఫూల్స్ అనే ట్వీట్ కూడా చేశారు. అందరినీ ఫూల్స్ చేయడానికి విషయాన్ని అగ్ని ప్రమాదం నుంచి ఫీజుల వైపు మళ్లిస్తున్నారా అని ఆయన అడిగారు.