గొట్టంగాళ్లు: టీడీపీ ఇంచార్జీలపై కేశినేని నాని సంచలనం
టీడీపీ నేతలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చశారు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీలను గొట్టంగాళ్లు అంటూ వ్యాఖ్యానించారు.
విజయవాడ: తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ ఇంచార్జీలను ఉద్దేశించి విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారంనాడు విజయవాడ ఎంపీ కేశినేనినాని మీడియాతో మాట్లాడారు. టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీలను గొట్టంగాళ్లు అంటూ కేశినేని నాని వ్యాఖ్యానించారు. పార్టీ ఆర్గనైజేషన్ నిమిత్తం నియోజకవర్గ ఇంచార్జీలను ఏర్పాటు చేసుకుంటారన్నారు. కానీ ఇంచార్జీల నియామకం రాజ్యాంగ పదవి కాదన్నారు. టీడీపీ ఇంచార్జీలు గొట్టంగాళ్లు అని వ్యాఖ్యానించారు.ఇది రాసుకోవాలని ఆయన మీడియా ప్రతినిధులకు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కొందరు గొట్టంగాళ్లు తనను రెచ్చగొట్టారన్నారు. తాను వైసీపీ సహా అన్ని పార్టీలతో సన్నిహితంగా ఉంటానని కేశినేని నాని చెప్పారు.
ఇతర పార్టీల ఆఫర్ల మీద తాను ఇంకా ఆలోచించలేదన్నారు. పార్టీ నుండి తనను పొమ్మనలేక పొగబెడుతున్నారా అని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు నాని స్పందించారు. తనకు 40 నుండి 50 శాతం వరకు మాత్రమే మంట ఉందన్నారు. వంద శాతం వరకు మంట వస్తే ఇతర పార్టీల్లో చేరాలని ఆఫర్లపై ఆలోచిస్తానని కేశినేని నాని తేల్చి చెప్పారు. తన కార్యాలయంపై ఉన్న ఫ్లెక్సీల్లోని ఫోటోలను చూపిస్తూ ఆ గొట్టంగాళ్ల గెలుపు కోసం కూడ తాను పనిచేస్తున్నానన్నారు. ప్రజల మంచి కోసం పనిచేసే వారి కోసం ఆఫర్లు వస్తాయన్నారు.
కేశినేని నాని కావాలో ఇంకా మరో నేత కావాలో ప్లెబిసెట్ నిర్వహించాలని మీడియా ప్రతినిధులకు కేశినేని నాని సూచించారు. టీడీపీ మహానాడులో ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతారని తనకు సమాచారం అందిందన్నారు. అందుకే తాను మహానాడుకు వెళ్లలేదన్నారు. మరో వైపు చంద్రబాబునాయుడు న్యూఢిల్లీ టూర్ కు సంబంధించి చంద్రబాబు పీఏ నుండి సమాచారం రావడంతో వెళ్లినట్టుగా చెప్పారు. అమిత్ షా, ఇతర బీజేపీ నేతలతో చంద్రబాబు సమావేశ వివరాలు తనకు తెలియవన్నారు.
also read:అల్లూరికి ఎక్కువ ...నేతాజీకి తక్కువ, నీ బిల్డప్ ఏంది?: కేశినేనిపై పీవీపీ ఫైర్
ఇటీవల కాలంలో విజయవాడ నియోజకవర్గం పరిధిలోని టీడీపీ ఇంచార్జీలనుద్దేశించి కేశినేని నాని విమర్శలు చేస్తున్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ప్రజా ప్రతినిధులతో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైసీపీ ప్రజా ప్రతినిధులపై కేశినేని నాని ప్రశంసలు కురిపించారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు కేశినేని నానిని అభినందించారు.