బెజవాడలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల భేటీ.. ఎంపీ కేశినేని నాని డుమ్మా, వరుసగా రెండోసారి
మంగళవారం విజయవాడలో జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల భేటీకి ఎంపీ కేశినేని నాని గైర్హాజరవ్వడం చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల క్రితం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నిర్వహించిన జిల్లా నేతల సమావేశానికి కూడా నాని హాజరుకాలేదు.
కృష్ణా జిల్లా టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం అంతుచిక్కడం లేదు. పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో వున్న ఆయన.. ఎలాంటి కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. ఇక ఢిల్లీలో చంద్రబాబు పర్యటన సందర్భంగా నాని వైఖరి తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా మంగళవారం ఉమ్మడి కృష్ణా జిల్లా శాఖ విస్తృత స్థాయి సమావేశం విజయవాడలో జరిగింది. ఈ భేటీకి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలు చర్చించారు. అయితే ఈ కీలక భేటీకి కేశినేని నాని హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల క్రితం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నిర్వహించిన జిల్లా నేతల సమావేశానికి కూడా నాని హాజరుకాలేదు.
ALso Read:కృష్ణాజిల్లా టీడీపీ నేతలతో కీలక సమావేశం.. ముగ్గురు నేతల డుమ్మా, చంద్రబాబు సీరియస్
నాటి సమావేశంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. పార్టీకి చెందిన చెన్నుపాటి గాంధీపై దాడి జరిగితే నేతలు సరిగా స్పందించకపోవడం దారుణమన్నారు. ఇకనైనా నేతల తీరు మారాల్సి వుందన్న ఆయన.. మారకుంటే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో జిల్లా నేతలంతా ఉమ్మడి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. అయితే ఇదే సమావేశానికి కీలక నేతలైన ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాలు గైర్హాజరైన వ్యవహారంపైనా చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఢిల్లీలో వున్న కారణంగా కేశినేని.. విదేశీ పర్యటనలో వున్నందున దేవినేని, బొండా ఉమాలు ఈ భేటీలో పాల్గొనలేకపోయారు.