Vijayawada: చిలకలూరిపేటలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని.. టీడీపీపై మరోసారి విమర్శలు గుప్పించారు. వెనుకబడిన కులాల ప్రజలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపించారు. 

Minister Vidadala Rajini: వెనుకబడిన కులాల ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్రోహం చేశారని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. శుక్రవారం చిలకలూరిపేటలోని మదర్ థెరిస్సా కాలనీలో జరిగిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మంత్రి రిజిని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యతనిచ్చార‌నీ, వైఎస్సార్‌సీపీ పాలనలో వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల వారు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు నాయుడు ప్రతిదానికీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఐదేళ్ల పాలనలో బీసీల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం రూ.19 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపిన మంత్రి విడద‌ల ర‌జిని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో బీసీల కోసం రూ.1.63 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఎన్నికల్లో బీసీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్న టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేసిందని ఆమె విమర్శించారు. బీసీల సంక్షేమానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి అన్నారు.

ఇదిలావుండ‌గా, మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఎయిమ్స్ మంగళగిరి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి విడ‌ద‌ల రజిని మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కింద ఎయిమ్స్‌లో ఉచిత వైద్య సేవలు అందజేయడం వల్ల బలహీన వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఉచితంగా నాణ్యమైన చికిత్స అందుతుంద‌ని తెలిపారు.

“ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఎయిమ్స్ - మంగళగిరితో ఒప్పందం కుదుర్చుకున్నాము. గత కొన్ని రోజులుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామ‌నీ, ఇప్పటికే 100 మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద ఎయిమ్స్‌లో ఉచితంగా చికిత్స అందించామని ఆమె తెలిపారు. క్యాన్సర్‌పై ప్రత్యేక దృష్టి సారించి మంగళగిరిలోని ఎయిమ్స్‌లో సీటీ స్కానింగ్‌ సేవలను కూడా ప్రవేశపెడతామని మంత్రి వివరించారు. క్యాన్సర్‌కు అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా చికిత్స అందించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆమె తెలిపారు. ఎయిమ్స్‌కు నీటి సరఫరా విషయమై విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌, తాడేపల్లె-మంగళగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ల నుంచి ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున ఆరు లక్షల లీటర్ల నీరు సరఫరా చేస్తున్నట్లు ఆమె వివరించారు. ఎయిమ్స్‌కు ఆరోగ్యమిత్రలను నియమించాలని, ఆరోగ్యశ్రీ కింద ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రజలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

Scroll to load tweet…