ఆయేషా మీరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు సతీష్‌, మరో ఏడుగురిపై నార్కో అనాలసిస్‌ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టేసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన విజయవాడ బీఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా హత్యకేసులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టేసింది. ఈ హత్యకేసులో అనుమానితులకు నార్కో పరీక్షలపై విజయవాడ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఆయేషా మీరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు సతీష్‌, మరో ఏడుగురిపై నార్కో అనాలసిస్‌ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు సతీష్‌తో పాటు.. హాస్టల్లో ఆయేషా మీరాతో ఉన్న స్నేహితురాళ్ల సమాచారం కీలకమని, వారికి నార్కో అనాలసిస్‌ పరీక్షలు అవసరమని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది. వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ పిటిషన్‌ను కొట్టేసింది.

అయేషా మీరా హత్య జరిగి సుమారు 12 ఏళ్లు అవుతోంది. ఉమ్మడి ఏపీలో 2007 డిసెంబర్ 27వ తేదీన విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని హాస్టల్‌లో అయేషా మీరా దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో సత్యంబాబును దోషిగా గుర్తించి పోలీసులు రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కేసులో సత్యం బాబు దోషి కాదని హైకోర్టు తేల్చడంతో అతను జైలు నుండి విడుదలయ్యారు. సత్యంబాబు కూడా జైలు నుండి విడుదల కావడంతో అసలు దోషులు ఎవరనే విషయమై తేల్చేందుకు ఈ కేసును సీబీఐకు అప్పగించింది హైకోర్టు. సీబీఐ అధికారులు ఈ కేసును మొదటి నుండి విచారణ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయేషా మీరా మృతదేహానికి 2020 ఫిబ్రవరిలో సీబీఐ అధికారులు రీపోస్టుమార్టం నిర్వహించారు