Vijayawada: వైఎస్సార్‌సీపీ సీనియర్‌ బీసీ నేతలతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైపాకా అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేడు స‌మావేశం కానున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని కీల‌క విష‌యాలు చ‌ర్చించే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం.  

AP CM YS Jagan Mohan Reddy: వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావడానికి పార్టీని అన్ని విధాలా బలోపేతం చేయాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టినుంచే సిద్దం కావాల‌ని పార్టీ శ్రేణుల‌కు సూచించిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నేడు ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల‌తో భేటీ కానున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల స‌న్న‌ద్ద‌త‌లో భాగంగా శనివారం నాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో బీసీ సీనియర్ నేతల ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. సంబంధిత వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు చెందిన బీసీ మంత్రులతో సహా తొమ్మిది మంది సభ్యులు సమావేశానికి హాజరు కావాలని సీఎంవో నుంచి పిలుపు వ‌చ్చింద‌ని స‌మాచారం. కాల్‌ అందుకున్న వారిలో బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్‌, జీ.జరయం, సి.హెచ్‌.వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కె.పార్థసారథి, మాజీ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌లు ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీసీల విశ్వాసాన్ని చూరగొనేందుకు ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ సహా మూడు ప్రాంతాలకు చెందిన బీసీ నేతలను ముఖ్యమంత్రి పిలిపించడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ క్యాడర్‌తో ఇంటరాక్టివ్ సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా ఆరా తీస్తున్నట్లు గమనించవచ్చు. రాష్ట్రంలో మ‌రోసారి అధికారం ద‌క్కించుకోవ‌డానికి ఇప్ప‌టికే నుంచే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేయాల‌ని వైకాపా భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ నెల 28న రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం

ఇదిలావుండ‌గా, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు నవంబర్ 28న పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందనుంది. 2020-21 రబీ, 2021 ఖరీఫ్ సీజన్లకు సంబంధించి సున్నా వడ్డీ రుణాల కోసం 8.22 లక్షల మంది రైతులకు అదే రోజున 160.55 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. ఆగస్టులో గోదావరి నదిలో వరదలు, సెప్టెంబర్-అక్టోబర్ మధ్య అకాల వర్షాల కారణంగా 60,832 ఎకరాల్లో పంట నష్టపోయిన 45,998 మంది రైతులకు 39.39 కోట్ల రూపాయల పరిహారం లభిస్తుంది. అధికారిక సమాచారం ప్రకారం 20 జిల్లాల్లో 34,292 ఎకరాల్లో 21,799 మంది రైతులు నష్టపోగా, వరదలు, కుండపోత వర్షాల కారణంగా 14 జిల్లాల్లోని 24,199 మంది రైతులకు చెందిన 26,540 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రైతులు అత్యధికంగా 12,886 ఎకరాల్లో పంట నష్టపోగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 42.5 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.

మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన జన్మదినమైన డిసెంబర్‌ 21న మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. భావనపాడు పోర్టు పనులు కూడా త్వరలో చేపడతామని పరిశ్రమల శాఖ మంత్రి జీ అమరనాథ్‌ శుక్రవారం తెలిపారు. మచిలీపట్నం ఓడరేవు పనులకు 4,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. విశాఖపట్నం-కాకినాడ పెట్రోకెమికల్ కారిడార్ రానున్న కాలంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా మారుతుందని మంత్రి చెప్పారు. ఈ ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది.