విజయవాడ-చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం .. టైమింగ్, టికెట్ ధరల వివరాలు ఇవే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రోజున దేశంలోని వివిధ మార్గాల్లో తొమ్మిది వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ తొమ్మిది రైళ్లలో తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్- బెంగళూరు, విజయవాడ- చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రోజున దేశంలోని వివిధ మార్గాల్లో తొమ్మిది వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ తొమ్మిది వందేభారత్ రైళ్లు 11 రాష్ట్రాల్లో కనెక్టివిటీని పెంచనున్నాయి. అందులో రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ తొమ్మిది రైళ్లలో తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్- బెంగళూరు, విజయవాడ- చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.
విజయవాడ- చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్, స్థానిక ఎంపీ కేశినేని నాని, రైల్వే ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక, ఈ రైలుకు సంబంధించిన వివరాలు, టికెట్ ధరలు ఇలా ఉన్నాయి.. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ-చెన్నై వందే భారత్ రైలు సుమారు 6 గంటల 40 నిమిషాల పాటు ప్రయాణిస్తుంది. విజయవాడ నుంచి మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలలో ఆగుతుంది. మధ్యాహ్నం 3.49 గంటలకు తెనాలి, సాయంత్రం 5.03 గంటలకు ఒంగోలు, సాయంత్రం 6.19 గంటలకు నెల్లూరు, రాత్రి 8.05 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో చెన్నై నుంచి ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఉదయం 7.05 గంటలకు రేణిగుంటలో, 8.39 గంటలకు నెల్లూరులో, 10.09 గంటలకు ఒంగోలులో, 11.21 గంటలకు తెనాలిలో ఆగుతుంది. మంగళవారం మినహా వారంలో అన్ని రోజులు ఈ రైలు పరుగులు తీయనుంది.
విజయవాడ నుంచి చెన్నైకి చైర్‌కార్ టికెట్ ధర రూ. 1,420, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 2,690 గా ఉంది. అయితే తిరుగు ప్రయాణంలో టిక్కెట్ ధరలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడకు ఏసీ చైర్ కార్ ధర రూ. 1,320, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 2,540గా ఉన్నాయి. అయితే ఈ ధరలలో క్యాటరింగ్ ఛార్జీలు చేర్చకపోతే.. విజయవాడ నుంచి చెన్నైకి చైర్ కార్ టికెట్ ధర రూ. 1,175, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 2,110. తిరుగు ప్రయాణంలో చెన్నై నుంచి విజయవాడకు.. చైర్ కార్ టికెట్ ధర రూ. 1075, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 2020గా ఉన్నాయి. ఈ వందేభారత్ సర్వీసుతో విజయవాడ-చెన్నైల మధ్య రవాణా మరింత మెరుగవుతుందని భావిస్తున్నారు.