Asianet News TeluguAsianet News Telugu

బాబు మనిషిని 8 కోట్లు ఇస్తావా, చస్తావా: పార్టీ ఫండ్ పేరిట వ్యాపారికి బెదిరింపులు

తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా చెప్పుకుంటున్న కొందరు పార్టీ ఫండ్‌ కోసం వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

vijayawada based business man case filed against tdp leaders warns to collect party fund
Author
Hyderabad, First Published Apr 15, 2019, 11:04 AM IST

తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా చెప్పుకుంటున్న కొందరు పార్టీ ఫండ్‌ కోసం వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన వీరపనేని రవికాంత్‌ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాల్లో మనోహర గ్రీన్స్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తుంటారు.

తెలుగుదేశం పార్టీకి చాలా కాలం పాటు సానుభూతిపరుడిగా, పార్టీకి అనుబంధంగా పనిచేశారు.  కొన్ని కారణాలతో పార్టీ కార్యక్రమాలకు రవికాంత్ దూరంగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో ఓ కేంద్ర మాజీ మంత్రికి అత్యంత సన్నిహితుడైన వెంకట్రావు నాయుడు అనే వ్యక్తితో రవికాంత్‌కు పరిచయం ఉంది.

గతంలో వీరిద్దరూ కలిసి రూ.10 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. ఈ క్రమంలో పార్టీ కోసం ఫండ్ ఇవ్వాలంటూ వెంకట్రావు నాయుడు... రవికాంత్‌ను కోరారు. తన ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా లేదని ఇప్పుడు ఇవ్వలేనని తేల్చి చెప్పారు.

దీనికి ఒప్పుకోని వెంకట్రావు.. మీకు సీఎం చంద్రబాబు 8 కోట్ల ఫండ్ టార్గెట్ పెట్టారని చెప్పాడు. రవికాంత్ ఈసారికి ఇవ్వలేనని తెగేసి చెప్పడంతో దొరబాబు, శ్రీనివాస్ అనే మరో ఇద్దరు రంగంలోకి దిగారు.

ఏప్రిల్ 7న వ్యాపారా లావాదేవీల కోసం ఒడిషా వెళ్లిన రవికాంత్‌కు... వెంకట్రావు, దొరబాబు ఫోన్ చేసి పార్టీ ఫండ్ ఏమైందంటూ అడిగారు. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో రంగంలోకి దిగిన శ్రీనివాస్ తాను చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడినని పరిచయం చేసుకున్నాడు.

మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది కాబట్టి.. కాంట్రాక్టులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఆసక్తిగా ఉన్నారని చెప్పాడు. వీరి బెదిరింపుల నేపథ్యంలో విజయవాడలో ఉంటే మంచిది కాదని భావించిన రవికాంత్ ఒడిషా నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు.

రాణిగంజ్‌లో ఉన్న ఓ హోటల్‌లో బస చేశారు.  పోలింగ్ తర్వాతి నుంచి వీరి స్వరంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. నువ్వెక్కడున్నావో మాకు తెలుసని వివరాలు చెప్పి.. భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటూ బెదిరింపులు మొదలెట్టారు.

దీంతో రవికాంత్ బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాకు మకాం మార్చారు. మళ్లీ వెంకట్రావు ఫోన్ చేసి ఇప్పుడెక్కడున్నది చెప్పడంతో పాటు రూ.8 కోట్లు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని హెచ్చరించాడు. దీనికి పోలింగ్ ముగిసింది కదా..? ఇంకా పార్టీ ఫండ్ ఏమిటంటూ అడిగినప్పటికీ అటు నుంచి తప్పదంటూ సమాధానం వచ్చింది.

తాము డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వకుంటే పంజాగుట్ట సర్కిల్‌లో నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో భయాందోళనలకు గురైన రవికాంత్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏపీలో మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని, నీవు వ్యాపారాలు ఎలా చేస్తావో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారని రవికాంత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కోర్టు అనుమతి తీసుకుని ఫిర్యాదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios