మళ్ళీ మొదలైన చంద్రబాబు అరెస్ట్ కేసు విచారణ... సర్వత్రా ఉత్కంఠ..!
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంపై విజయవాడ ఏసిబి కోర్టులో విచారణ కొనసాగుతోంది.

విజయవాడ : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంపై విజయవాడ ఏసిబి కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ(ఆదివారం) ఉదయం నుండి కేసును విచారిస్తున్న న్యాయస్థానం గంటపాటు భోజన విరామం ఇచ్చింది. విరామ సమయం ముగియడంతో న్యాయమూర్తి మళ్లీ విచారణనను ప్రారంభించారు.
అరెస్టయిన చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రాతో పాటు పోసాని వెంకకటేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు.ఇక సిఐడి తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపిస్తోంది. ఇరుపక్షాల వాదనలు వింటున్న న్యాయమూర్తి కొద్దిసేపట్లో తీర్పు వెలువరించనున్నారు. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేసిన చంద్రబాబును రోజంతా విజయవాడ సిట్ కార్యాలయంలో విచారించారు సిఐడి అధికారులు. రాత్రి నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉదయం విజయవాడ ఏసిబి కోర్టులో హాజరుపర్చారు. చంద్రబాబు విచారణ నేపథ్యంలో ఏసిబి కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. చంద్రబాబు కుటుంబసభ్యులు తప్పితే టిడిపి నాయకులు ఎవ్వరినీ కోర్టులోకి అనుమతించడంలేదు పోలీసులు.
Read More విజయవాడ ఏసిబి కోర్టువద్ద ఉద్రిక్తత... టిడిపి నాయకులను అడ్డుకున్న పోలీసులు...
ఇక చంద్రబాబుపై సెక్షన్ 409 నమోదుచేయడంపై కోర్టులో వాడివేడిగా వాదనలు కొనసాగాయి. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన తరఫున లాయర్ ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్ చంద్రబాబు పేరు లేదు కాబట్టి సీఐడీ ఎలా అరెస్ట్ చేస్తుందని ప్రశ్నించారు. ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తించదని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు.
ఈ సమయంలో ఏఏజీ సుధాకర్ రెడ్డి.. ఈ కేసులో ఏ 35 ఘంటి వెంకట సత్య భాస్కర్ ప్రసాద్‌ను అరెస్ట్ చేసినప్పుడు హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు కూడా ఇదే వర్తిస్తుందని చెప్పారు. ఈ కేసులో 16- 3- 2023న ఏ35 విషయంలో ఈ సెక్షన్ వర్తిస్తుందని హైకోర్టు ధర్మాసనం తీర్పనిచ్చిందన్న పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే కేసులో కేసులో ఉన్న చంద్రబాబుకు సైతం 409 వర్తిస్తుందని తెలిపారు.
ఇలా ఉదయం నుండి విచారణ చేపడుతున్న కోర్టు మధ్యలో 15 నిమిషాల విరామం ఇచ్చింది. అనంతరం మళ్లీ వాదనలు కొనసాగించింది. భోజన సమయంలో కావడంతో గంటపాాటు విచారణను వాయిదా వేసింది. భోజనం ముగించుకుని మళ్లీ వాదనలు ప్రారంభించారు.