హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి యూటర్న్ తీసుకున్నారా..?ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు ఎక్కుపెట్టే రాములమ్మ వెనక్కి తగ్గడానికి కారణం అదేనా..? 

తెలుగుదేశం పార్టీతో పొత్తును అంగీకరించని రాములమ్మ తప్పక పొగుడుతున్నారా..?ఎన్నికల ఫలితాల అనంతరం కూడా చంద్రబాబు వల్లే ఓటమి చెందామని పరోక్షంగా ఆరోపించిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఆదేశాలతో సర్దుకుపోతున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. 

గత కొద్ది రోజులుగా రాములమ్మ వైఖరిలో మార్పులే అందుకు నిదర్శనంగా చెప్పకోవచ్చు. ఇటీవలే చంద్రబాబు నాయుడును ప్రశంసించిన విజయశాంతి తాజాగా ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చేసిన ధర్మపోరాట దీక్షపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ ప్రజలకు చేస్తున్న మోసాన్ని తెలియజేయడంలోనూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశానికి చాటి చెప్పడంలోనూ సీఎం చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారని చెప్పుకొచ్చారు. 

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్‌తో పాటూ దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు సమర్ధించడం హర్షనీయమన్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన నిరసన దీక్ష ద్వారా కాంగ్రెస్ చీఫ్ రాహూల్ గాంధీ గారి నేతృత్వంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడితే తప్ప తెలుగు ప్రజలకు న్యాయం జరగదన్న విషయంపై స్పష్టత వచ్చిందని విజయశాంతి ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా తెలియజేశారు. 

రాజకీయాలకు అతీతంగా ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీల నేతలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ముక్త కంఠంతో నినదించారని తెలిపారు. కానీ పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదాకు మద్దతిస్తామని ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌గారి నేతృత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీ నామమాత్రంగానైనా ఈ విషయంపై ప్రకటన చేయలేదని విమర్శించారు. 

 

కేసీఆర్‌కి తెలుగు ప్రజల ఆకాంక్షల కంటే, మోదీ ప్రాపకం మాత్రమే ముఖ్యమన్న విషయం దీని ద్వారా మరోసారి రుజువైందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం దేశాన్ని కదిలించే రీతిలో జరిగిన దీక్షకు మద్దతు తెలపలేని టీఆర్‌ఎస్ అధినేత, విజయవాడకు వెళ్లి అక్కడి ప్రజల అభిమానం చూరగొందామని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. 

ఇలాంటి అవకాశవాద రాజకీయం చేసే నేతలనే కాదు వారిని చేరదీసే వారినీ ఎక్కడ ఉంచాలో ఏపీ ప్రజలకు బాగా తెలుసునని విజయశాంతి ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో విరుచుకుపడ్డారు.