అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. చంద్రబాబు ఏపీ సీఎం వైయస్ జగన్ కు రాసిన లేఖపై సెటైర్లు వేశారు. సీఎం జగన్ కి చంద్రబాబు నాయుడు రాసే మెుదటి లేఖ ప్రజాసమస్యలపై ఉంటుందనుకున్నామన్నారు. 

 

40 ఏళ్ల అనుభవానికి తన ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా, పోతుందా అనే సంశయం తప్ప ఇంకేమీ కనిపించడం లేనట్టు ఉందని విరుచుకు పడ్డారు. ప్రపంచం మెుత్తాన్ని అమరావతికి రప్పిస్తానన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా అంటూ ఎద్దేవా చేశారు. 

మరోవైపు సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల రాసిన టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు సాహసోపేత నిర్ణయమంటూ కొనియాడారు. 

 

కొన్ని సందర్భాల్లో విశ్రాంత జడ్జిలతో విచారణ చేయించడం చూశాం కానీ ఇప్పుడు నిరంతర స్క్రూటిని ఉంటుందని చెప్పుకొచ్చారు. జగన్ గారి పాలన ఎంత పారదర్శకంగా ఉండబోతోందో అన్నదానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమేనని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే వైయస్ జగన్ శారదా పీఠాన్ని సందర్శించడంపై యెల్లో చానల్ ఒకటి చర్చపెట్టిందని చెప్పుకొచ్చారు. కుల మీడియా పెద్దాయన ఒకరు మాట్లాడుతూ స్వాములు ఎవరిని ముట్టుకోరు ఆలింగనం ఎలా చేసుకుంటారని తన  అజ్ణానాన్ని, ఏడుపును ప్రదర్శించారుని ధ్వజమెత్తారు.  పీఠాదిపతులు ఎలా వ్యవహరించాలో కూడా వీరే నిర్ణయిస్తారంటూ మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి.