హైదరాబాద్: టీవీ9 మాజీ సిఈవో రవిప్రకాష్ పై వైఎస్సార్ కాంగ్రెసు విజయసాయి రెడ్డి తీవ్రమైన ఆరోపణలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. రవిప్రకాష్ అక్రమ లావాదేవీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరిపించాలని ఆయన కోరారు. 

రవిప్రకాష్ వ్యాపారాల జాబితాతో, షేర్ల వివరాలతో విజయసాయి రెడ్డి సిజెకు ఆ లేఖ రాశారు. మొయిన్ ఖురేషీ, సానా సతీష్ లతో కలిసి రవిప్రకాష్ పలువురిని మోసం చేశాడని ఆయన ఆరోపించారు. హవాలా డబ్బులతో ఉగండా, కెన్యాల్లో కేబుల్ వ్యాపారంలో రవిప్రకాష్ పెట్టుబడులు పెట్టాడని ఆయన అన్నారు. 

ఆదాయం పన్నును ఎగ్గొట్టి రవిప్రకాష్ ఆస్తులు కూడబెట్టారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. రవిప్రకాష్ కుంభకోణాలపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. విదేశాల్లో రవిప్రకాష్ ఏర్పాటు చేసిన కంపెనీల వివరాలను కూడా విజయసాయి రెడ్డి లేఖలో పొందుపరిచారు. ఆ కంపెనీల్లో రవిప్రకాష్ వాటాల వివరాలు కూడా అందించారు.

రవిప్రకాష్, సానా సతీష్, మొయిన్ ఖురేష్ కలిసి ఓ వ్యాపారిని బెదిరించారని ఆయన చెప్పారు. ఆ వ్యాపారి పేరును కూడా తన లేఖలో ప్రస్తావించారు. భారతీయ చట్టాలను రవిప్రకాష్ అడ్డంగా తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. రవిప్రకాష్ అనే పేరు మీదనే కాకుండా రవిబాబు పేరు మీద కూడా కంపెనీల్లో వాటాలున్నాయని ఆయన చెప్పారు. 

టీవీ9 అక్రమాల కేసులో రవిప్రకాష్ ను హైదరాబాదు జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రవిప్రకాష్ ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్ గుడా జైలులో ఉన్నారు. ఆయన దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ దసరా తర్వాత కోర్టులో విచారణకు రానుంది. ఈలోగా సోమవారంనాడు తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి రవిప్రకాష్ ను జైలులో కలిశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.