వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై వ్యంగాస్త్రాలు విసిరారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. చంద్రబాబు పూర్తి నిస్పృహలో పడి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదన్నారు. ట్విట్టర్ వేధికగా.. చంద్రబాబు, లోకేష్ ని ఏకిపారేశారు.

‘పాపం! చంద్రబాబు పరిస్థితి పగవాడికి కూడా రావొద్దు. పూర్తి నిస్పృహలో పడి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావటం లేదు. తన అభ్యర్థులనే ఊసరవెల్లులని, మోసకారులని తిడుతున్నారు. ఎమ్మెల్యేలకు దోచిపెట్టినట్టు తనే ఒప్పుకుంటున్నారు. అయినా గురువులాగే శిష్యులు తయారవుతారు కదా?’అంటూ ట్వీట్‌ చేశారు.

మరొక ట్వీట్‌లో ‘ఐదేళ్లు కష్టపడి చదువుకున్నాడట చంద్రబాబు. పాస్‌ చేయండని ప్రజలను వేడుకుంటున్నారు. లోకేశ్‌ను ఇలాగే ప్రతీ పరీక్షలో తను పాస్‌ చేయించాడు. చివరికి అమెరికాలో ఫీజు కూడా ఎవరితోనో కట్టించారు. చంద్రబాబు, పరీక్షలు ఇలాగే ఉంటాయి’అంటూ చంద్రబాబు, లోకేశ్‌లకు చురకులు అంటించారు. ‘వేల కోట్ల డబ్బు వెదజల్లి, కుల మీడియా మద్దతుతో గెలవొచ్చని ఆశపడిన చంద్రబాబు ఇప్పుడు గతుక్కుమంటున్నాడు. మనిషికి 2 వేలు ఇస్తామన్నా ఆయన మీటింగులకు జనాలు వెళ్లే పరిస్థితి లేదు. హాజరైన వారి నుంచి స్పందన లేవు. కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయింది. ఇక 20 రోజులే చంద్రబాబూ!’ అని పేర్కొన్నారు.