పేరు తీయకుండా విజయ్ మాల్యా తో చంద్రబాబుకు లింక్ పెట్టిన విజయసాయి రెడ్డి
తండ్రి కొడుకులిద్దరూ మొన్నటి వరకు హైదరాబాద్ కరోనా వైరస్ బారిన పడకుండా సేఫ్ ప్లేస్ అని భావించారని, ఇప్పుడు విచారణ జరుపుతున్న సంస్థల నుండి తప్పించుకోవడానికి వేరే సేఫ్ ప్లేస్ కోసం వెదుకుతున్నారని ఆయన అన్నారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ లపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ఘాటుగా స్పందించాడు. ట్విట్టర్ వేదికగా ఇద్దరిపై సెటైర్లు వేశారు.
తండ్రి కొడుకులిద్దరూ మొన్నటి వరకు హైదరాబాద్ కరోనా వైరస్ బారిన పడకుండా సేఫ్ ప్లేస్ అని భావించారని, ఇప్పుడు విచారణ జరుపుతున్న సంస్థల నుండి తప్పించుకోవడానికి వేరే సేఫ్ ప్లేస్ కోసం వెదుకుతున్నారని ఆయన అన్నారు.
ఇక ఈ ట్వీట్ కి అనుసంధానంగా మరో ట్వీట్లో చంద్రబాబు నాయుడు లండన్ లో తలదాచుకుంటున్న తన మిత్రుడైన ఒక పారిపోయిన భారతీయ పారిశ్రామికవేత్తను భారత్ నుండి ఎలా తప్పించుకోవాలని ఆయనను అడిగి తెలుసుకుంటున్నారని ఇప్పుడే విన్నానని ఆయన ట్విట్టర్ వేదికగా అన్నారు.
ఇకపోతే.... తమ పార్టీ మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆనయ కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు ఆయన శనివారంనాడు ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాదులోని నివాసంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారని, ప్రజా సమస్యలపై చేస్తున్న తమ పోరాటాలను సహించలేక అక్రమ అరెస్టులకు తెర తీశారని ఆయన అన్నారు. ఏడాది పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.
నిన్న అచ్చెన్నాయుడిని, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్యలో భాగమేనని ఆయన అన్నారు. తాను జైలుకు వెళ్లాననే అక్కసుతో జగన్ కక్ష పెంచుకుని ఇతరులను జైలుకు పంపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.
ప్రతీకారేచ్ఛతో జగన్ రాష్ట్రాన్ని పతనం చేస్తున్నారని, కక్ష సాధింపు చర్యలతో తమ పార్టీని ప్రజలకు దూరం చేయలేరని ఆయన అన్నారు. రెట్టించిన బలంతో ప్రజాసమస్యలపై పోరాడుతామని ఆయన చెప్పారు. అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటామని ఆయన చెప్పారు. వైసీపీ ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడుతామని ఆయన చెప్పారు.