వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఎప్పుడూ చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు  చేసే విజయసాయి.. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా ని టార్గెట్ చేశారు. ఏపీలోని ప్రాజెక్టుల పునులకు రివర్స్ టెండరింగ్ అమల్లోకి తెస్తామని సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

కాగా...ఈ ప్రకటనపై ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంలో ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగగా స్పందించారు. మంత్రి దేవినేని టార్గెట్ చేస్తూ... విమర్శలు చేశారు.

‘‘ప్రాజెక్టుల పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే మీకు, మీ అధినేతకు వెన్నులో వణుకు పుడుతుందా ఉమా? పోలవరంలో మీరు దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తాం. మీలాగా కుల, వర్గ బలహీనతలు సీఎం జగన్ గారికి లేవు. చూస్తారుగా తొందరెందుకు?’’ అని దేవినేని ఉమాని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

‘‘అవినీతి లేని రాష్ట్రంగా ఏపీకి కొత్త ఇమేజి తీసుకొస్తామని సీఎం గారు చెబుతుంటే పచ్చ పార్టీ నేతలు పరిశ్రమలు రావని అంటున్నారు. గతంలో ఐటీ, ఈడీ దాడులు జరిగితే ఇలాగే మాట్లాడారు. కరెప్షన్‌ను వ్యవస్థీకృతం చేసిన చంద్రబాబు గారు అది లేకుండా పనులెలా జరుగుతాయనడంలో వింతేమీ లేదు.’’ అని మరో ట్వీట్ లో  పేర్కొన్నారు.

‘‘ప్రజల వేళ్లపై పోలింగు రోజు వేసిన సిరా మరక ఇంకా చెరగనేలేదు. అప్పుడే గుండెలు బాదుకునే బ్యాచ్‌ వీధుల్లోకి వచ్చింది. మంగళగిరి ప్రజలు పొర్లించి కొట్టిన మాలోకానికి కాస్త వేచి చూడాలన్న స్పృహ కూడా లేదు. అప్పుడే ఏడుపు లంకించుకున్నాడు.’’ అంటూ లోకేష్ పై సెటైర్లు వేశారు.