అమరావతి: టిడిపి నాయకులపై జరుగుతున్న దాడులపై కామెంట్స్ చేసిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. పార్టీ నాయకులను కాదు తనను చంపాలంటూ చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నాడని... అయినా రాజకీయంగా ఎప్పుడో చ‌చ్చిన పామును చంపాల్సిన అవ‌స‌రం ఎవరికి ఉంటుంది? అంటూ సోషల్ మీడియా వేదికన ఎద్దేవా చేశారు.

''కోర్టు బోనులో భోరున ఏడుస్తూ ముద్దాయి జడ్జీ గారిని అడిగాడట... తల్లీ తండ్రీ లేని వాడిని శిక్షించకండని. ఇంతకీ ఇతను చేసిన నేరం ఏంటని జడ్జీ గారు విచారిస్తే ఆ తలిదండ్రులను చంపింది వీడేనని ప్రాసిక్యూషన్‌ వారు చెప్పారట. అమిత్‌షా గారి దగ్గరకు వెళ్ళిన టీడీపీ ఎంపీల తీరు ఇలాగే ఉంది'' అంటూ ట్విట్టర్ వేదికన టిడిపి తీరుపై విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. 

''నిన్న అమిత్‌ షా గారి దగ్గరకు వెళ్ళిన టీడీపీ ఎంపీలు ఆయనకు ప్రవీణ్‌ చక్రవర్తి వీడియో చూపించి ఫిర్యాదు చేశారంట. ఆ వీడియో ఎప్పటిది? 2016-17 నాటిది. అంటే దొంగలు ఎవరు? నేరం ఎవరిది?'' అని నిలదీశారు.

read more   అలా పుట్టింది కాబట్టే... జగన్ ప్రభుత్వంలో విధ్వంసాలు: మంతెన సీరియస్ కామెంట్స్
 
''నన్ను కూడా చంపండి అంటూ వీధి నాటకం మొదలెట్టారు చంద్రబాబు. రాజకీయంగా ఎప్పుడో చ‌చ్చిన పామును చంపాల్సిన అవ‌స‌రం ఎవరికి ఉంటుంది? మొన్న ఎన్నిక‌ల్లో చావు త‌ప్పి క‌న్ను లొట్టపోయింది. అయినా ఏదో విధంగా ప్రజల సానుభూతితో ల‌బ్ది పొందాలని లేచి బుసలు కొడుతున్నారు'' అని అన్నారు.

''చేపల కోసం కొంగలా ఓట్ల కోసం చంద్రబాబు కొంగ జపం. అధికారంలో ఉన్నప్పుడు దేవాదాయ నిధులను పక్కదోవ పట్టించాడు. ప్రైవేటు వ్యక్తులకు గ్రాంట్లుగా ఇచ్చాడు. ఆలయాలపై దండయాత్ర చేశాడు. తాను కూల్చేసిన దేవాలయాలను ఇప్పుడు పునర్నిర్మిస్తుంటే నానా రచ్చ చేస్తున్నాడు'' అని మండిపడ్డారు.

''ఓటుకు నోటు కేసులో స్టీఫెన్‌సన్‌తో ‘ఫర్ ఎవ్రీథింగ్, ఐయామ్ విత్ యూ’అని చంద్రబాబు మాయ చేయడం, నిమ్మాడలో నామినేషన్ వేయొద్దని అప్పన్నకు చేసిన ఫోన్‌ కాల్‌లో అచ్చెన్న వాడిన భాష ఒకేలా ఉన్నాయి. ‘నీకు అన్యాయం జరిగింది. ఇకపై బాగా చూసుకుంటా’ అంటున్నాడు. ఎంతైనా బాబు ట్రెయినింగ్ కదా!'' అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.