వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు మాజీ మంత్రి లోకేష్ లపై విజయసాయి రెడ్డి సెటైర్ల వర్షం కురిపించారు.

ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'బిల్‌గేట్స్‌ని తీసుకొచ్చానన్నావ్‌.. బిల్‌ క్లింటన్‌ని తీసుకొచ్చానన్నావ్‌.. టోని బ్లెయిర్‌ని తీసుకొచ్చానన్నావ్‌.. ఇంతకీ పప్పుని తీసుకొచ్చావా, లేదా' అంటూ ట్వీట్‌ చేశారు. కాగా మరో ట్వీట్‌లో 'పప్పూ...తప్పు..! నాన్న మీద అలిగేవా? పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే తప్ప మందలగిరి రానన్నావా? పప్పూ... తప్పు తప్పు..! అంటూ' విజయసాయి రెడ్డి మరో ట్వీట్‌‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 

ఇదిలా ఉండగా.. ఇటీవల వైసీపీ గత ఎన్నికల్లో విజయం సాధించి సంవత్సరం పూర్తైన సందర్భంగా కూడా విజయసాయి ట్విట్టర్ లో స్పందించారు. జగన్ పై ప్రశంసలు కురిపిస్తూ.. చంద్రబాబుపై విమర్శలు చేశారు.

"ఏడాది క్రితం ఇదే రోజు, ‘ఫ్యాన్’ ప్రభంజనాన్ని దేశమంతా కళ్లార్పకుండా చూసింది. ఏకపక్ష విజయంతో చరిత్రను తిరగరాశారు జననేత జగన్ గారు. తన వెంట నడిచిన ప్రజల కోసం ‘పది తలల విషనాగు’తో పోరాడారాయన. వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి, వేల కోట్లు వెదజల్లిన పచ్చ పార్టీని పాతాళానికి తొక్కారు." అని ట్వీట్ చేసారు. 

 మరో ట్వీట్లో... 9 సంవత్సరాలపాటు జగన్ ని ఎన్నివిధాలుగా ఇబ్బందులకు గురిచేసారో చెప్పుకొస్తూ... జగన్ ని అభిమన్యుడిలా ఒంటరివాడిని చేసి మట్టుపెట్టాలని చూసినా, జగన్ గుండె ధైర్యం ముందు వారు నిలవలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. "తొమ్మిదేళ్ల పాటు ఎన్నెన్ని కుట్రలు. జైలుకు పంపడం. అభిమన్యుడిలా ఒంటిరివాడిని చేసి మట్టుపెట్టాలని చూశారు. కర్ణుడిలా అశక్తుడిని చేసి హతమార్చాలని స్కెచ్చులు వేశారు. ఆ గుండె ధైర్యం, పట్టుదలల ముందు ప్రత్యర్థులు తోక ముడవక తప్పలేదు. ప్రజలకు జీవితకాల భరోసాగా నిల్చాడు యువనేత." అని ఆయన రాసుకొచ్చారు.