అమరావతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబు విశాఖ పర్యటనపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రజలు ఉమ్మేస్తారన్న సిగ్గు కూడా లేకుండా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. 

నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా రాజధాని చేయాలని నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ బస్సు యాత్రకు బయలుదేరుతావా, ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. 

Also Read: రాజకీయాల నుండి తప్పుకొంటా, నిరూపిస్తారా: బాబుకు మంత్రి అవంతి సవాల్

"జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి కింద ఏటా 15 వేలు, కాలేజి విద్యార్థులకు 20 వేల వసతి దీవెన, ఇంగ్లిష్ మీడియంలో బోధన. విద్యార్థుల భవిష్యత్తు కోసం రూపొందించిన ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలో కనిపించవు. పిల్లల నోరుకొట్టి మీరు తాగే హిమాలయ వాటర్ కు మాత్రం కోట్లు పోశావు కదా బాబూ!" అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. 

"ఏం చట్టం కింద నన్ను వెనక్కు పంపుతారని బట్టలు  చించుకుంటున్నాడు. ప్రజల మధ్య విష బీజాలు నాటే వారిని వంద సెక్షన్ల కింద లోపలికి నెట్టొచ్చు. ఏడాది కిందట స్పెషల్ స్టేటస్ కోరే ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన జగన్ గారిని ప్రజా ప్రతినిధులను ఏ చట్టం కింద ఎయిర్ పోర్టు నుంచి తిప్పి పంపావు?" అని ఆయన అన్నారు.

Also Read: విశాఖలో బాబు వెనక్కి: హైకోర్టులో టీడీపీ లంచ్ మోషన్ పిటిషన్