అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోతిరెడ్డిపాడు వివాదంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటన నేపథ్యంలో ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కళ్లు మండుతున్నాయా కేసీఆర్ అన్నది చంద్రబాబునే అని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. 

"‘కళ్లు మండుతున్నాయా’ అని అన్నది నిన్నే బాబూ. పొరుగు రాష్ట్రంలో ప్రవాస జీవితం. ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ. పక్కింటి వాళ్లు కూడా గుర్తించని అజ్ఞాతవాసం ఎక్కడ. బయట అడుగుపెడితే క్షణాల్లో వీడియోలు సోషల్ మీడియాకెక్కుతున్నాయి. ఎంత కష్టం వచ్చిపడింది!" అని విజయసాయి రెడ్డి అన్నారు. 

"ఆ క్షణం కోసం ఎల్లో మీడియా వారం రోజులపాటు ఎదురు చూసింది. ఎడిటోరియల్స్, కాంగ్రెస్ వాళ్లని రెచ్చగొట్టడాలు, టీవీల్లో జలజగడాలంటూ తగాదా పెట్టే చర్చలు అన్నీ నీరు కారిపోయాయి. కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో ఏదో అంటారని ఆశపడి భంగపడ్డారు. బాబు కూడా లైవ్ చూశాడంట ఏదైనా వినిపిస్తుందేమో అని" అని ఆయన అన్నారు.

"కరోనా మనతోటే ఉంటుంది కాబట్టి 65 ఏళ్లు దాటినోళ్లు బయటకు రావద్దని కేసీఆర్ గారు కూడా చెప్పారు. జాగ్రత్త బాబూ! నీకు 71 ఏళ్లు అని వైరస్ ఇట్టే పసిగడ్తుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం, ప్రతిపక్ష నేతగా పదకొండేళ్లు లాంటివి కరోనాకు అర్థం కావు." అని విజయసాయి రెడ్డి అన్నారు.

"సగం రాష్ట్రానికి తాగు, సాగు నీరందించే పోతిరెడ్డిపాడు గురించి నోరు మెదపడు. ఎవరో సస్పెండైన డాక్టరు తాగి రోడ్డుమీద చిందులేస్తే ఒకటే ట్వీట్లు పెడుతున్నాడు. ప్యాకేజీ తీసుకుని పనిచేసే జీతగాళ్లను కూడా ఎగదోస్తున్నాడు. వ్యక్తుల ప్రయోజనాలు తప్ప రాష్ట్రం గురించి పట్టదా చంద్రబాబూ?" అని విజయసాయి రెడ్డి అన్నారు.