వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీలో చుక్కెదురైంది. తనపై విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జరిగిందంటూ ఆయన తప్పుడు ఫిర్యాదు చేశారని పార్లమెంట్ సభాహక్కుల సంఘం తేల్చింది.

పార్లమెంట్ సభ్యుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలతో సభా హక్కుల సంఘం, లోక్‌సభకు 70వ నివేదికను సమర్పించింది.

ఈ నివేదికలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదులోని వాస్తవాల పరిశీలన అంశాలను ప్రివిలేజ్ కమిటీ ప్రస్తావించింది. విశాఖ ఎయిర్‌పోర్టులో విజయసాయిపై దాడి జరిగిందనడానికి సాక్ష్యాలు లేవని సభాహక్కుల సంఘం స్పష్టం చేసింది.

26 జనవరి 2017లో విశాఖ ఎయిర్‌పోర్టులో తన దాడి జరిగిందని ఆయన చేసిన ఫిర్యాదుకు ఆధారాలు లేని కారణంగా అది సభాహక్కుల ఉల్లంఘనకు రాదని నివేదికలో తెలిపారు.

కాగా, 26 జనవరి 2017లో విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోసం ర్యాలీ చేయాలని ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. అప్పట్లో తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం జరుగుతుండడంతో ఆ స్పూర్తితో అందరూ ముందుకు రావాలని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రతిపక్షనేత జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు ముఖ్యనేతలు హైదరాబాద్‌లో విమానం ఎక్కి విశాఖలో దిగారు. అయితే అప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ తర్వాత రోజున విశాఖలో పెట్టుబడుల సదస్సు ఉండడంతో నిరసనలపై ఆంక్షలు విధించారు.

విశాఖ విమానాశ్రయంలోను జగన్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్టు రన్‌వేపై జగన్, విజయసాయి నిరసనకు దిగారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు తాము అధికారంలోకి వచ్చాక సంగతి చూస్తామని హెచ్చరించారు.

ఈ ఘటనలో విజయసాయి దురుసుగా వ్యవహరించారు. ఆయన పోలీసులను తోచేస్తున్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనపై పోలీసులు దాడి చేశారంటూ ఎంపీ హోదాలో రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రివిలేజ్ కమిటీ ఆయన తప్పుడు ఫిర్యాదు చేశారని తేల్చింది.