జగన్ ని దెబ్బతీసేందుకే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం వైఎస్ వివేకా దారుణ హత్య కు గురైన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై విజయసాయిరెడ్డి శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.

కడప జిల్లాలో అధికార పార్టీకి వివేకా హిమాలయ శిఖరంలా అడ్డు నిల్చున్నారన్నారు. భౌతికంగా అంతం చేస్తే తప్ప.. కడపలో పట్టు దొరకదని.. ఇలా అమానవీయంగా హతమార్చారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ లే కుట్రకు బాధ్యలు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

ఇక మరో ట్వీట్ లో.. ‘‘రాజారెడ్డి గారి హంతకులు తెలుగుదేశంలో ఉన్నత హోదాల్లో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు అలాగే ఉన్నాయి.హత్యాయత్నంలో జగన్ గారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సాఫ్ట్ టార్గెట్ వివేకానంద గారిని బలితీసుకున్నారు. రక్త దాహం తీరదా చంద్రబాబూ?’’ అని ఆరోపించారు.

‘‘అరకు ఎమ్మెల్యే కిడారి హత్య జరిగినపుడు ఇంటెలిజెన్స్ లో విఫలమయ్యారని అప్పటి విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను సస్పెండ్ చేశారు. సస్సెన్షన్ ఎత్తివేసి ఆయనను ఇటీవలే కడప ఎస్పీగా నియమించారు. ఇదంతా ఒక భారీ కుట్ర అనడానికి ఇంతకంటే రుజువులేం కావాలి?’’ అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.