రాజ్యసభ ఎంపీ, వైసీపీ నాయకుడు విజయ సాయిరెడ్డిపై టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న ఆరోపణలు చేశారు. ఆయన వయస్సుకు తగిన మాటలు మాట్లాడాలని సూచించారు. సీఎం జగన్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. 

వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీ విజయ‌సాయి రెడ్డిపై టీడీపీ నాయ‌కుడు బుద్దా వెంక‌న్న తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. ఆయ‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణలు చేశారు. ఉత్తరాంధ్ర భూకాసురుడు అంటే రాష్ట్రం, దేశం మొత్తం తెలుసని అన్నారు. ఉత్తరాంద్ర‌కు సీఎం జ‌గ‌న్ విజ‌సాయిరెడ్డిని ఇంఛార్జ్ గా చేస్తే, చంద్రబాబు త‌న‌ని ఇంఛార్జ్ చేశార‌ని, మ‌రి ఎవ‌రిది కుల పార్టీ అని ప్ర‌శ్నించారు. 

సీఎం జగన్ అవినీతి లో భాగమై, జైలుకెళ్లినందుకే విజ‌య సాయిరెడ్డికి రాజ్య‌స‌భ సీటు ఇచ్చార‌ని బుద్దా వెంట‌న్న ఆరోపించారు. జగన్ సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించాక ఉద్యోగాలు పోయాయ‌ని అన్నారు. మ‌ళ్లీ ఇప్పుడు జాబ్ మేళా అంటూ జగన్నాటకం మొదలు పెట్టార‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లక్షలాది మందికి పని లేకుండా చేసిన ఘనుడు సీఎం జగన్ అని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. 

బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి వైసీపీకి సిగ్గు ఉండాల‌ని చెప్పారు. కొడాలి నాని, వెల్లంపల్లి, రంగరాజు చెప్పారని వారి సామాజిక వర్గాలకు మంత్రి పదవులు ఇవ్వలేద‌ని ఆరోపించారు. వారికి, జగన్ కు మధ్య ఉన్న డీలింగ్స్ ఏమిటో తెలియ‌జేయాల‌ని డిమాండ్ చేశారు. ఆ సామాజిక వర్గాలలో‌ వాళ్లే మంత్రులు కావాలా అని ప్ర‌శ్నించారు. వాళ్లు బినామీలుగా ఉన్నారు కాబట్టే జగన్ ఆయా సామాజిక వర్గాలకు అన్యాయం చేశార‌ని ఆరోపించారు.

ఎంపీ విజయసాయి రెడ్డి త‌న వయసు తగ్గ విధంగా‌ మాట్లాడాల‌ని బుద్దా వెంక‌న్న హిత‌వు ప‌లికారు. టీడీపీ నేత లోకేష్ కు నిక్ నేమ్ పెడితె, తాము కూడా చిప్ప కూడు విజయసాయి రెడ్డి అని‌ పిలుస్తామ‌ని అన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలు మెత్తగా ఉన్నారనే కేంద్రానికి పంపార‌ని తెలిపారు. సీఎం జ‌గ‌న్ త‌న చెప్పు చేతల్లో న‌డుచుకునే వారికే మంత్రి ప‌ద‌వులు ఇచ్చార‌ని అన్నారు. 

బీసీల‌కు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అని, టీడీపీ బీసీల పార్టీ అని ఆయ‌న బుద్దా వెంకన్న అన్నారు. ఎన్టీఆర్, చంద్ర‌బాబు నాయుడి వల్లే బీసీలు అన్ని విధాలా అభివృద్ధి చెందార‌ని తెలిపారు. బీసీల‌కు ఇచ్చే అదరణ, వ‌చ్చే పథ‌కాలను జగన్ తుంగ‌ల్లో తొక్కార‌ని తెలిపారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు జగన్ బీసీల మంత్రం జ‌పిస్తున్నార‌ని ఆరోపించారు. 

బీసీలకు సీఎం జ‌గన్ ఏం చేశారో చెప్పాల‌ని ఆయ‌న అన్నారు. జగన్ కు సూట్ కేసుల కంపెనీ మోసిన చరిత్ర విజయసాయి రెడ్డిదని తెలిపారు. మార్కెట్ లో 2000 నోట్లు కనిపించకుండా చేసిన ఘనత జగన్ కే ద‌క్కుతుంద‌ని అన్నారు. వచ్చే ఎన్నికలలో డ‌బ్బులు పంచాలని విజయసాయి రెడ్డి ఈ కొత్త ఎత్తు వేశార‌ని చెప్పారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతి పై సోమిరెడ్డి కోర్టుకు సాక్ష్యాలు ఇచ్చారని అన్నారు. వాటిని దొంగిలించారంటే, ప‌రిస్థితిని ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలని తెలిపారు. జగన్ కేసులలో కూడా సాక్ష్యాలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. సీబీఐ అధికారులు ఆ సాక్ష్యాలకు మరింత భద్రత కల్పించాల‌ని సూచించారు. వివేకానంద రెడ్డిని కత్తులతో నరికి, గుండె పోటుగా చిత్రీకరించార‌ని ఆరోపించారు. ఈ కేసులో ఆధారాలు కూడా గోప్యంగా ఉంచి భద్రత కల్పించాల‌ని కోరారు. 

రాష్ట్రంలో ఇసుక సులువ‌గా దొరికేలా చేయాల‌ని విజ‌య‌సాయి రెడ్డిని బుద్ధా వెంక‌న్న కోరారు. అప్పుడే లక్షలాది మంది కార్మికుల‌కు పని దొరుకుతుంద‌ని అన్నారు. జాబ్ మేళా పేరుతో రాజకీయం చేయడం మానుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలో కార్మికులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ‌ని అన్నారు. మద్యపాన నిషేధం అని అబద్దపు హామీలతో జగన్ గెలిచార‌ని, కానీ మూడేళ్లల్లో ధరలు రెట్టింపు చేసి ఖజానాను నింపుకున్నార‌ని ఆరోపించారు. 

వాలంటీర్లకు రూ. 5 వేల జీతంగా ఇస్తున్నార‌ని, దానితో వారి కుటుంబం ఎలా గ‌డుస్తుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ ఆలోచ‌న లేకుండా వారితో వెట్టి చాకిరీ‌ చేయిస్తారా అని అన్నారు. విజయసాయి రెడ్డి కులాల పేరుతో రాజకీయం చేయడం మానుకోవాల‌ని కోరారు. చంద్రబాబు కు కులం ఆపాదించి పబ్బం గడుపుకోవాలని చూడొద్ద‌ని అన్నారు. సీఎం జగన్ చేసే కుళ్లు రాజకీయాలు, కుల రాజకీయాలు ఎవ్వరూ చేయలేద‌ని బుద్దా వెంక‌న్న తెలిపారు.