ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పలువురు సమర్థించినా... మరికొందరు విమర్శిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. మాతృభాషలోనే మాధుర్యం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏ ప్రాంతవాసులైనా తమ భాషను కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. మనదేశానికి వచ్చి మనతో మాట్లాడటానికి బ్రిటీష్ వాళ్లు.. వారి భాషను తమకు నేర్పించారని ఆయన అన్నారు. వాళ్ల కారణంగానే మన భాష బలహీనంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఆంగ్ల భాషను ప్రోత్సహిస్తూనే.. మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఇంష్లీష్ భాషపై అందరికీ మోజు పెరిగిపోయిందని... ఆంగ్లం రాకపోతే పైకి రాలేమని చాలా మంది భావిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ భావన ప్రజలతోపాటు... ప్రభుత్వాల్లో కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారని, ప్రధాన మంత్రి మోదీ కాన్వెంట్‌ను చూడలేదని వివరించారు. శ్రమ, సాధన, అంకితభావంతోనే ఎవరైనా ఎదగగలరని ఆయన తెలిపారు.

 ‘‘ఇంగ్లీషు నేర్చుకోవాల్సిందే. కానీ జనం భాష అవసరం. మాతృభాష కళ్లు లాంటిది. పరాయి భాష కళ్లద్దాల్లాంటిది. కళ్లుంటేనే కళ్లద్దాలతో చూడగలుగుతాం. కళ్లు లేకపోతే రేబాన్‌ జోడు పెట్టుకున్నా చూడలేం’’ అని వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రంలోనైనా మాతృభాషే నేర్చుకోవాలన్నారు.
 
‘‘ఇంగ్లీషు అవసరం అనడం వల్ల ప్రభుత్వాన్ని తప్పు పట్టకూడదు. కానీ మన రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన సంగతి మర్చిపోకూడదు’’ అని అన్నారు. తన మాటలను వివాదం చేసే ప్రయత్నం చేయవచ్చుగానీ, దేశం కోసం, దేశ ప్రజల కోసం మాతృభాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్భోధించారు.