అమరావతి: ఎల్జీ పాలీమర్స్ కు తాను అనుమతులు ఇవ్వలేదని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకై 12 మంది మరణించిన నేపథ్యంలో వైసీపీ, టీడీపి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఆ పరిశ్రమకు చంద్రబాబు హయాంలోనే అనుమతులు ఇచ్చారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా మంత్రులు, వైసీపీ నేతలు అంటున్నారు. 

ఆ పరిశ్రమకు తాను అనుమతులు ఇవ్వలేదంటూ చంద్రబాబు వైఎస్ జగన్ కు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబును సవాల్ చేశారు. ఆ విషయం తేల్చుకోవడానికి మీరు విజయవాడ వస్తారా, నన్ను హైదరాబాదు రమ్మంటారా అని అడిగారు. 

"చంద్రబాబు గారూ...ఎల్జీ ప్లాంట్ కు అనుమతులపై చర్చకు వస్తారా అని అడిగారు.మీరు ఇంట్లోంచి బయటకు వస్తారా? నన్ను హైదరాబాద్ రమ్మంటారా, మీరు విజయవాడ వస్తారా?" అని ఆయన అడిగారు. 

"అనేకసార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చంద్రబాబు ఇప్పుడు ధర్నాలు చేస్తామంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. విద్యుత్తు ఛార్జిల పెంపుకు నిరసనగా బషీర్ బాగ్ లో ఆందోళన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపించి ముగ్గురి ప్రాణాలు బలిగొన్న చరిత్ర నీది. 20 ఏళ్లైనా ఎవరూ మర్చిపోలేదు" అని విజయసాయి రెడ్డి అన్నారు.