వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కలిశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నెల్లూరు నేతలు, ఆనంను సీఎం వద్దకు తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఆనంతో మాట్లాడిన జగన్.. ఇకపై ఎలాంటి సమస్యలున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే తాను చేసిన మాఫియా వ్యాఖ్యలపై రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు.

Also Read:చంద్రబాబుతో భేటీ: బుక్కైన ఆనం, జగన్ సీరియస్

దీంతో ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వాలనుకున్న ప్రతిపాదన నుంచి వైసీపీ అధిష్టానం విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో సీనియర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు జగన్. 

కొద్దిరోజుల క్రితం నెల్లూరు పట్టణం అనేక రకాల మాఫియాలకు అడ్డాగా మారిపోయిందని ఆనం రాంనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ రోజురోజుకు ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, సాండ్ మాఫియాలతో పాటు కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్ల ఆగడాలు పెరిగిపోయాయన్నారు.

Also Read:జగన్ మాటే శాసనం, గీత దాటితే చర్యలే:మాజీమంత్రి ఆనంకు విజయసాయిరెడ్డి వార్నింగ్

రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా మాఫియా గ్రూపులన్ని ఇక్కడ వున్నాయని అన్నారు. ఈ మాఫియాలపై చర్యలు తీసుకునే విషయంలో అధికారులు ఒక అడుగు ముందుకు వేయాలంటే వారి ఉద్యోగ భద్రత గుర్తొస్తోందని... అందువల్లే వెనక్కి తగ్గుతున్నారని  అన్నారు. ఈ మాఫియాల ఆగడాలతో నెల్లూరులో వేలాది కుటుంబాలు, లక్షలాది ప్రజలు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారని ఆనం విమర్శించారు.