నెల్లూరు: నెల్లూరు జిల్లాను మాఫియాకు అప్పగించేశారంటూ చేసిన వ్యాఖ్యలు మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఆనం వ్యాఖ్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని అలాంటిది పరిధి దాటి ఎందుకు ప్రవర్తించారంటూ విజయసాయరెడ్డిని నిలదీశారు. పార్టీలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారట జగన్. 

ఆనం రామనారాయణరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి ఆదేశించినట్లు తెలుస్తోంది. ముందుగా ఆయన వ్యాఖ్యలపై వివరణ తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. 

సస్పెన్షన్ వేటు వేసే ముందు నెల్లూరు జిల్లాలో నెలకొన్న పరిణామాలపై ఆరా తియడంతోపాటు షోకాజ్ నోటీసు జారీ చెయ్యాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమాధాం ఇవ్వకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆ విషయంలో పూర్తి అధికారాలు విజయసాయిరెడ్డికి ఇచ్చినట్లు సమాచారం. 

ఇకపోతే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇటీవలే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబుతో ఆనం రామనారాయణరెడ్డి సమావేశమయ్యారంటూ వైసీపీలో కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. 

వైయస్ జగన్ మంత్రివర్గంలో మంత్రి పదవి ఆశించారు ఆనం రామనారాయణరెడ్డి. రాజకీయాల్లో సీనియర్ నేత కావడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమంటూ ప్రచారం జరిగింది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డిలకు అవకాశం కల్పించారు. 

దాంతో ఆనం రామనారాయణరెడ్డి ఒకింత అసహనానికి గురైన సంగతి తెలిసిందే. అనంతరం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే ఉంటున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ కూడా తెలుగుదేశంపై విరుచుకుపడ్డారు ఆనం.  

ఆనం వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. వైసీపీలో జగన్ మాటే శాసనం అని అది ఎవరు దాటినా చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ఎవరూ పార్టీ గీతదాటొద్దని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావాలే తప్ప అంతర్గత అంశాలు మీడియా ముందుకు తీసుకువస్తే సహించేది లేదంటూ ఘాటుగా హెచ్చరించారు. 

పార్టీలో ఎంతటి వారైనా గీత దాటితే చర్యలు తప్పవన్నారు విజయసాయిరెడ్డి. పార్టీలో ఉన్న తాను అయినా లేకపోతే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అయినా లేక మరోకరైనా సరే మినహాయింపు లేదని పార్టీకి విధేయతతోపాటు క్రమశిక్షణ సైతం అవసరం అన్నారు.

నెల్లూరు జిల్లలో వైసీపీ నేతల మధ్య ఎలాంటి విబేధాలు లేవన్నారు. ఆనం ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో తెలియదన్నారు. తమకు ఒక్కరే నాయకులు అని అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. బహుశా గత ప్రభుత్వం గురించి ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడి ఉండొచ్చని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. 

ఇకపోతే ఆనం రాంనారాయణరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరులో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా మాఫియా లేదని తెలిపారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తుందని తెలిపారు. ఆనం రాంనారాయణరెడ్డి ఎందుకు అలా మాట్లాడారో తెలియదని ఆయననే వివరణ అడగాలంటూ చిర్రబుర్రులాడారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 

ఇకపోతే శుక్రవారం వెంకటగిరిలో ఆనం రాంనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా అనేక మాఫియాలు అడ్డాగా మారిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు పట్టణం ఒక అడుగు ముందుకు వేయాలి అన్నా అధికారులకు వాళ్ళ ఉద్యోగ భద్రత గుర్తొస్తుందన్నారు. 

నెల్లూరు నగరంలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, సాండ్ మాఫియా, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు, మీకు ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు పట్టణం అందుకు కేంద్రంగా మారిందన్నారు. ఈ మాఫియా ఆగడాలకు నెల్లూరు పట్టణంలో వేలాది కుటుంబాలు లక్షలాది ప్రజలు బలయ్యారన్నారు. 

వారంతా బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఐదు సంవత్సరాలలో నలుగురు ఎస్పీలు మారిన ఘనత నెల్లూరు జిల్లాకే దక్కిందంటూ మాజీమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. 

జగన్ మాటే శాసనం, గీత దాటితే చర్యలే:మాజీమంత్రి ఆనంకు విజయసాయిరెడ్డి వార్నింగ్.