వెంకయ్య ప్రతీ అడుగు ఏపిలో తెలుగుదేశాన్ని బలోపేతం చేయటమే అని ఎప్పుడో స్పష్టమైపోయింది.
కేంద్రం అదే డ్రామాను మళ్లీ మొదలుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో ఒక మంత్రి కుదరదు కాక కుదరదని పార్లమెంట్ లోనే స్పష్టం చేస్తారు. బయటేమో వెంకయ్యనాయడు అదేమీ లేదు క్యాబినెట్ నోట్ రడీ అవుతోందంటూ పాత పాటే పాడుతారు. నోట్ రడీ చేయాల్సిన హోంశాఖ మంత్రి కుదరదన్నపుడు వెంకయ్య అందుకు విరుద్ధంగా ఎందుకు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మ్యాటర్ క్లియర్. తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపులను ప్రోత్సాహించటమే వెంకయ్య లక్ష్యం. వెంకయ్య ప్రతీ అడుగు ఏపిలో తెలుగుదేశాన్ని బలోపేతం చేయటమే అని ఎప్పుడో స్పష్టమైపోయింది. అందుకనే ఉద్దేశ్యపూర్వకంగానే గందరగోళం సృష్టిస్తున్నారు.
మీకు గుర్తుందా, ప్రత్యేకహోదా విషయంలో కూడా ఇటువంటి డ్రామానే వెంకయ్య ఆడారు. ప్రత్యేకహోదా విషయంలో డ్రాఫ్ట్ రెడీ అవుతోందని ఒకసారి. నీతి అయోగ్ అధ్యయనం చేస్తోందని ఇంకోసారి. నీతి అయోగ్ అన్నీ శాఖల మంత్రులతోనూ సమావేశం జరిపి నివేదికను ప్రధానికి త్వరలో అందిస్తుందని మరోసారి. ఇలా..ఎన్ని కథలు చెప్పాలో అన్నీ చెప్పారు. వెంకయ్యకు మరో కేంద్రమంత్రి సుజనా చౌదరి పక్కవాధ్యం. చివరికేమైంది ?
దాదాపు ఏడాదిన్నర కాలాన్ని నాన్చి ప్రత్యేకహోదా ఇవ్వటానికి కేంద్రం సిద్ధంగా ఉన్నాపొరుగు రాష్ట్రాలు ఒప్పుకోవటం లేదని మెలికపెట్టారు. నిజం చెప్పక తప్పదని అనిపించినపుడు ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యం కాదని తేల్చేసారు. ఇపుడు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశం కూడా అదే దారిలో వెళుతోంది. రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీ ఎంపిలు నియోజకవర్గాల పెంపు గురించి ప్రశ్నలు వేయటం, సాధ్యం కాదని కేంద్రం సమాధానం చెప్పటం ఇప్పటికే చాలాసార్లు అయ్యింది.
అంటే వెంకయ్య ఎందుకు ఈ డ్రామాలాడుతున్నారు? సింపుల్, ప్రతిపక్షాన్ని చీల్చిచెండాటానికి చంద్రబాబునాయుడుకు అవకాశం ఇవ్వటం. తాజాగా నిర్వహిస్తున్న జిల్లాల వారీ సమీక్షల్లో కూడా నియోజకర్గాలు పెరుగుతాయనే చంద్రబాబు చెబుతుండటం గమనార్హం. ఓవైపేమో నియోజకవర్గాల పెంపు వల్ల మన పార్టీకి ఎటువంటి లాభమూ ఉండదని భాజపా నేతలు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు నివేదిక కూడా అందించారు. నివేదికను చదివిన తర్వాత కూడా భాజపా కేంద్ర నాయకత్వం నియోజకవర్గాల పెంపుకు ఆమోదం తెలుపుతుందా అన్నది అనుమానమే.
