ప్రముఖులు తిరుమల శ్రీవారిని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దర్శించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మంగళవారం వెంకయ్యనాయుడు కుటుంబసమేతంగా తిమరుల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వైకుంఠం1 క్యూ కాంప్లేక్స్ ద్వారా వెంకయ్య నాయుడు ఆలయ ప్రవేశం చేసారు. ఆలయ మహా ద్వారం వద్ద ఆలయ అర్చకులు ఇస్తికపాల్ స్వాగతం పలికారు.

స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల‌ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన‌ మీడియాతో మాట్లాడారు.

ప్రముఖులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలని.. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఆకలి, అవినీతి లేని సమాజం నిర్మాణం కావాలన్నారు. అసమానతలు.. ఘర్షణలు లేని సమాజం కావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.