ఆత్మకూరు:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు వ్యతిరేకించారు. పాలన ఒక్క చోటు నుంచే జరగాలనేది తన నిశ్చితాభిప్రాయమంటూ ఆయన జగన్ ను ప్రతిపాదనను వ్యతిరేకించారు. స్వర్ణ భారతి ట్రస్టులో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

మాతృభాష కు ప్రాధాన్యం విషయంలో తనది మొదటి నుంచి ఒకటే అభిప్రాయమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగులో ప్రాధమిక బోధన ఉండాలనేదే తన అభిప్రాయమని వెంకయ్య నాయుడు అన్నారు.ప్రధాని సైతం మాతృ భాషకు ప్రాధాన్యంపై అనేక సార్లు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

అభివృద్ధి వికేంద్రీకరణకు తాను మొదటి నుంచి కట్టుబడి ఉన్నట్లు వెంకయ్య నాయుడు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్ర సంస్థలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు.కేంద్ర మంత్రిగా నాడు ప్రత్యేకం గా చొరవ  తీసుకుని జిల్లాకో కేంద్ర సంస్థ ఏర్పాటు అయ్యేలా చూసానని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇలా జరగాలి గానీ పాలన ఒక్క చోట నుంచే ఉండాలనేది తన నిశ్చితాభిప్రాయమని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి, పాలనా యంత్రంగం హైకోర్టు, అసెంబ్లీ ఒక్క చోటనే ఉండాలని అన్నారు. అన్ని ఒక్క చోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుందని చెప్పారు. అది ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంమని అని, తన 42 ఏళ్ళ అనుభవంతో ఈ మాట చెపుతున్నానని ఆయన అన్నారు.వివాదం కోసమో, రాజకీయం కోణంలోనో తన అభిప్రాయాన్ని చూడవద్దని అన్నారు. కేంద్రం తనను అడిగితే తాను ఇదే అభిప్రాయం చెపుతానని అన్నారు.