అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎపి మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి తెలుగుదేశం పార్టీ నేత నన్నపనేని రాజకుమారి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

నన్నపనేని రాజకుమారి తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు సమర్పించారు. ఆ రాజీనామాను ఆయన వెంటనే ఆమోదించారు. దాంతో నన్నపనేని రాజకుమారి స్థానంలో వాసిరెడ్డి పద్మను నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 

కాగా, వాసిరెడ్డి పద్మ పార్టీ అధికార ప్రతినిధిగా అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో వాగ్ధాటిని ప్రదర్శించారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై, తెలుగుదేశం ప్రభుత్వంపై ఆమె విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చారు. 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు వాసిరెడ్డి పద్మ సన్నిహితురాలు. ఆమెకు వాసిరెడ్డి పద్మ చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు.