గుంటూరు: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి లాక్ డౌన్ నిబంధనలను ఉళ్లంఘిస్తూ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ తిరుగుతున్నారని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య మండిపడ్డారు. ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని... వెంటనే క్వారంటైన్ లో వుంచాలని వర్ల డిమాండ్ చేశారు. 

''ముఖ్య మంత్రి గారు! 14 రోజులు క్వరంటైన్ కు వెళ్లవలసి వస్తుందని యూపీ ముఖ్య మంత్రి తన తండ్రి అంత్య క్రియలకు డిల్లీ వెళ్లలేదు. మరి A2 విజయసాయి రెడ్డి గారు నేషనల్ పెర్మిట్ లారీ లాగ రాష్ట్రాలన్నీ కలియ తిరుగుతున్నాడు. ఈయనను క్వరంటైన్కు పంపక్కరలేదా? కరొనాకు అతీతుడా? మీ ప్రభుత్వం తప్పు కదూ?'' అని ప్రశ్నించారు. 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఇష్టమొచ్చినట్లుగా మొరగడం మానుకోకపోతే క్షమించేది లేదని రాజ్యసభ సభ్యుడు విజయసాయి వర్ల హెచ్చరించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి దేశవిదేశీ మేథావులతో చర్చించి కేంద్రానికి, రాష్ట్రానికి అమూల్య సలహాలు ఇస్తున్న చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలడం మంచిపద్ధతి కాదని హితవు పలికారు.

ఏపీలోను, పొరుగురాష్ట్రాల్లో యధేచ్చగా తిరుగుతున్న విజయసాయి రెడ్డిని క్వారంటైన్లో 14 రోజులు ఉంచాలని వర్ల రామయ్య రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ, విశాఖ, చెన్నై, హైదరాబాద్ లలో రోజుకొకచోట ఆయన దర్శనమిస్తున్నాడని... లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఆయనపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో పలు జిల్లాలకు ఇష్టారాజ్యంగా చక్కర్లు కొట్టడమేమిటని విజయసాయి రెడ్డిని నిలదీశారు. దేశమంతా లాక్ డౌన్ ను తూచా తప్పక పాటిస్తూ క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటే విజయసాయి ఉల్లంఘనకు పాల్పడటం దుర్మార్గమన్నారు. వయస్సు మళ్ళిన వారు రక్తదానం ఇవ్వకూడదన్న  నిబంధనలను సైతం విజయసాయి ఎలా అతిక్రమిస్తారని ప్రశ్నించారు. 

ఎంపీ విజయసాయి రెడ్డిని తక్షణమే క్వారంటైన్ లో 14 రోజులు నిర్బంధించి నెగిటీవ్ అని నిర్ధారణ అయిన తర్వాతే రాష్ట్రంలో తిరగానివ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వర్ల రామయ్య సూచించారు.