షర్మిల భర్త అనిల్, వైఎస్ భారతిలపై వర్ల సంచలన వ్యాఖ్యలు

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 11, Aug 2018, 9:58 AM IST
Varla Ramaiah makes serious comments on Anil
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపైనే కాకుండా షర్మిల భర్త అనిల్ పై కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపైనే కాకుండా షర్మిల భర్త అనిల్ పై కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఇప్పటికైనా భారతిపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకోవడానికి జగన్‌కు ఆయుధంగా ఉపయోగపడిన అనిల్‌ శాస్త్రి అలియాస్‌ బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ను సైతం నిందితుల జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు.  రాష్ట్ర ప్రజలను నిరంతరం వంచిస్తున్న జగన్‌కు వంచనపై దీక్ష చేసే అర్హత లేదని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు.
 
అప్పుల్లో ఉన్న వైఎస్‌ కుటుంబ వారసుడు మూడు లక్షల పన్ను చెల్లించే స్థితి నుంచి ఏడాదిలోపే రూ.84 కోట్ల అడ్వాన్స్‌ టాక్స్‌ చెల్లించే స్థాయికి ఎలా ఎదిగారన్నది దేశంలో ఏ ఆడిటర్‌కు కూడా అర్థం కావటంలేదని ఆయన అన్నారు. తండ్రి సీఎంగా ఉండగా సీఎంవోలో కూర్చొని ఒకేరోజు 389 జీవోలు అనుకూలంగా తెప్పించుకున్న జగన్‌ నీతులు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. 

ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా అండ చూసుకొని తనకు ఏమీ కాదులే అనుకుంటున్న జగన్‌ను జైలుకు వెళ్లకుండా దేవుడు కూడా రక్షించలేడన్నారు.
 
అద్దె ఇంట్లో మొదటి భార్య, పిల్లలతో ఉన్న అనిల్‌ శాస్త్రి వైఎస్‌ అల్లుడయ్యాక, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌గా మారారని, ఆ తర్వాత 11 కంపెనీల్లో డైరెక్టర్‌ అయ్యాడని ఆయన ఆరోపించారు. వైసీపీ అధ్యక్షుడి అక్రమాస్తుల్లో భారతి పాత్ర ఈడీకి కనిపించినప్పుడు సీబీఐకి ఎందుకు కనిపించదని ప్రశ్నించారు. 

సుమోటోగా తీసుకుని 11 చార్జిషీట్లలో భారతి, అనిల్‌ను కూడా చేర్చాలని రామయ్య సీబీఐ కోర్టును కోరారు. జగన్‌ విశ్వసనీయత గురించి 77 ప్రశ్నలు సంధించిన రామయ్య వాటిలో మొదటి ఎనిమిదింటికీ సమాధానం చెప్తే చెవి కోసుకుంటానని సవాల్‌ విసిరారు.

loader