ఏపీ టీడీపీలో ముసలం మొదలైంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలపై టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. పనికిమాలిన నలుగురు ఎంపీలు పార్టీని వీడినంత మాత్రాన టీడీపీకీ వచ్చిన నష్టం ఏమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

అరెస్ట్ భయంతో అండర్ గ్రౌండ్‌కు వెళ్లిన సుజనాచౌదరిని బీజేపీ నేతలు ఎలా తీసుకున్నారని అడిగారు. సుజనాకు ఏం క్లీన్‌చిట్ ఉందని బీజేపీలోకి తీసుకున్నారో తెలియట్లేదన్నారు. అయినా వారు ప్రజల్లోంచి వచ్చిన రాజకీయ నేతలు కాదన్నారు. చంద్రబాబు దయాదాక్షిణ్యాలపై పదవులు పొందినవారని గుర్తుచేశారు. వారంతా స్వప్రయోజనాల కోసమే పార్టీ మారారన్నారు.
 
గురువారం నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులైన సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి బీజేపీలో చేరారు. బీజేపీలో విలీనం అవుతున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ కూడా అందజేశారు. మరికొందరు కూడా వీరి మార్గంలోనే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో బలం పెంచుకునేందుకు బీజేపీ ఆకర్ష్ మంత్రం ఉపయోగిస్తుండగా.. టీడీపీ నేతలు సులభంగా బుట్టలో పడుతున్నారు.